వైకాపా నాయకులు గత ఐదేళ్లుగా విశాఖలో సాగిస్తున్న అక్రమ దందాకు అడ్డేలేదు. విశాఖను బంగారుగనిలా మార్చుకుని అడ్డగోలుగా సాగిస్తున్న దోపిడీకి అదుపేలేదు. రేడియెంట్, ఎన్‌సీసీ, దసపల్లా, హయగ్రీవ, రామానాయుడు స్టూడియో.. ఇలా వేల కోట్ల రూపాయల విలువైన భూములు, ప్రాజెక్టులు వైకాపా నాయకులు, వారి బినామీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. బయటకు కనిపిస్తున్న ప్రాజెక్టుల విలువే సుమారు రూ.7,950 కోట్లు. వెలుగులోకి రాని వాటి విలువ మరికొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
బెదిరిస్తారు.. బేరం పెడతారు
వైకాపా అధికారంలోకి రాగానే ప్రభుత్వ పెద్దలు విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటూ నాటకానికి తెరతీశారు. అప్పట్లో వైకాపాలో నం.2గా ఉన్న నేత అక్కడ తిష్ఠ వేశారు. అంతకుముందే విశాఖలోని కీలక ప్రాజెక్టులు, వివాదాస్పద భూముల సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలు తమ వద్ద ఉంచుకున్నారు.
ఫిర్యాదులు పరిష్కరిస్తామంటూ ప్రజాదర్బారు పేరుతో మరో నాటకం మొదలుపెట్టారు. ఫిర్యాదుదారులను వైకాపా నేతలు పిలిపించి మాట్లాడేవారు. ‘‘మేం చెప్పిన ధరకు ఆ భూమిని మాకు ఇచ్చేయ్. లేకపోతే ఆ భూమి నీకు దక్కదు’’ అని బెదిరించేవారు. ఇలా చాలా భూములను కాజేశారు. కొన్ని భూములకైతే లేనిపోని వివాదాలు సృష్టించి.. వాటా ఇవ్వాలని బేరం పెట్టారు. విలువైన భూములు కొనుగోలు చేసిన కొందరి దగ్గరికి వెళ్లి.. ‘‘అమ్మకందారులు మీకంటే ముందు మాతో విక్రయ ఒప్పందం చేసుకున్నారు.. మీరు ఆ స్థలాన్ని కొనుగోలు చేస్తే సమస్యలు వస్తాయి’’ అంటూ బెదిరించారు. చివరకు సెటిల్మెంట్లు చేసి రూ.కోట్లు కొట్టేశారు.
సేవ ముసుగులో..
రుషికొండలో రూ.300 కోట్ల విలువైన భూమి.. వై.ఎస్. సోదరి విమలారెడ్డి సందేశాలిచ్చే ‘సెయింట్ లూక్స్’ అనే మైనార్టీ ఎడ్యుకేషన్ సొసైటీ చేతుల్లో ఉంది. వై.ఎస్. సీఎంగా ఉన్న సమయంలో 2009లో ఆ సంస్థకు 7.35 ఎకరాల భూములు కేటాయించారు. ఎకరం రూ.1.50 కోట్లకు ఇవ్వొచ్చని కలెక్టర్ సిఫారసు చేస్తే.. ఆ సంస్థకు రూ.25 లక్షలకే ఎకరం చొప్పున కేటాయించారు. ‘‘క్రిస్టియన్ కమ్యూనిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల సాధికారతకు నర్సింగ్ శిక్షణ ఇస్తాం. ఆస్పత్రి నిర్మించి పేదలకు వైద్యం అందిస్తాం’’ అంటూ ఆ సంస్థ భూములు తీసుకుంది. ఇంత వరకు అక్కడ ఎలాంటి ఆస్పత్రిని నిర్మించలేదు. ప్రార్థన మందిరాన్ని మాత్రం కట్టేశారు. విమలారెడ్డి అక్కడికి వస్తూ సందేశాలు ఇస్తుంటారు. ఆ భూమిలోని కొంత భాగంలో షెడ్డు వేసి నర్సింగ్ శిక్షణ ఇస్తున్నారు.
విశాఖలోని తెదేపా, జనసేన నాయకులు బలంగా నమ్ముతున్న దాని ప్రకారం… విశాఖ నగరంలో ఈ ఐదేళ్లలో జరిగిన ప్రతి భూదందా వెనుక మాస్టర్ మైండ్ ‘ముఖ్యనేత’దే..! ప్రతి ప్రాజెక్టులోనూ ముఖ్యనేత వాటా 20 శాతం. అది ఏ రూపంలో ఉండాలి? ఎలా ఇవ్వాలి? తన వాటాగా భూమి/స్థలం తీసుకుంటే… ప్రాజెక్టులో అది ఏ పక్కన ఉండాలి? వంటి విషయాల్ని ముఖ్యనేతే స్వయంగా నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు వైకాపా నాయకుల చేతుల్లోకి వెళ్లిన, వాటిలో వివరాలు బయటకు వచ్చిన ప్రాజెక్టుల్లోనే సుమారు రూ.1,600 కోట్ల విలువైన వాటా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ముఖ్యనేతకు చేరినట్టు అంచనా. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాల్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా పోస్ట్ పెడితేనే వారిపై కేసులు పెట్టి, అరెస్ట్ చేసి, వెంటాడి వేధిస్తున్నారే…. మరి విశాఖ కేంద్రంగా వైకాపా నాయకులు, వారి బినామీలు చెలరేగిపోతుంటే, రూ. వేల కోట్ల విలువైన భూములు చేతులు మారితే ప్రభుత్వం కేసులు ఎందుకు పెట్టదు? విచారణ ఎందుకు జరపదని విపక్షాలు నిలదీస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్… విశాఖలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కేంద్రంగా జరిగిన భూ అక్రమాల్ని బయట పెట్టినా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. విశాఖలో భూ అక్రమాలపై విజయకుమార్ ఆధ్వర్యంలోని సిట్ నివేదికను ప్రభుత్వం తనకు అనుకూలంగా చేసుకుందని, దాన్ని బయటకు రానివ్వలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
source : eenadu.net
Discussion about this post