సీఎం జగన్ సొంత జిల్లాలో అదీ ఆయన జన్మించిన జమ్మలమడుగులోని ఓ సర్కారు బడి వీధిన పడింది. ‘మీ బిడ్డ అమ్మఒడి ఇస్తున్నాడు.. మీ బిడ్డ పిల్లల భవిష్యత్తుకు ఆంగ్ల విద్యను తీసుకొచ్చాడు.. మీ బిడ్డ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశాడు’ అని సీఎం పదే పదే సభల్లో చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడంలేదు. సీఎం జగన్ అధికారం చేపట్టి నాలుగేళ్లు గడుస్తున్నా.. వేమగుంటపల్లె ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేక రాజీవ్ నగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఒకే గదిలో నడుస్తున్న ఈ పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల వరకు 45 మంది విద్యార్థులున్నారు. వీరికి మరుగుదొడ్లు లేవు.. భోజనశాల అసలే లేదు. ఇరుకు గదుల్లోనే పాఠాలు వింటూ చెట్ల కిందే భోజనం చేస్తున్నారు. ఆడపిల్లలు సైతం మలమూత్ర విసర్జనకు ఆరుబయటకు వెళ్లాల్సిందే. మనబడి… నాడు-నేడు కింద రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న పాలకులు, అధికారులు కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయమై ఎంఈవో రమణారెడ్డి మాట్లాడుతూ రూ.13 లక్షలతో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
source : eenadu.net
Discussion about this post