పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది.
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ‘సిద్ధం’ సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంట్ స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.
తొలి రోజు యాత్ర ఇలా..
సీఎం జగన్ ఈరోజు ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.
ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
source : sakshi.com
Discussion about this post