‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు. ఆ మూడు రాజధానులు ఎక్కడున్నాయి? జనం అమాయకులు, తానేం చెప్పినా చెల్లుబాటు అవుతుందనుకున్నారో ఏమో కానీ జగన్ చాలా అలవోకగా ఇలాంటి అబద్ధాలను వల్లె వేశారు. ‘ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి చేశాం.. గొప్ప మార్పు తీసుకువచ్చాం.. ఇది దేశ చరిత్రలో గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది’ అంటూ తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఆయన ప్రసంగం ఆద్యంతం.. ఆత్మస్తుతి, పరనింద తరహాలో సాగింది. ‘99 శాతం హామీలను అమలు చేశాం. ఉద్యోగాలిచ్చాం, రాష్ట్రంలో అవినీతి లేకుండా చేశాం’ అని కూడా ప్రకటించారు.వివిధ పథకాల కింద ఎంత మంది లబ్ధి పొందారు అని లెక్కలు చెప్పుకొచ్చారు.
ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం జగన్ సభ జరుగుతున్న అదే నంద్యాలకు గతంలో ఏం హామీలిచ్చారు? వాటిలో ఎన్ని పూర్తి చేశారనేది చెప్పకపోవడం గమనార్హం. తనను ఓడించేందుకు నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారని..వారికి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరిస్తోందని విమర్శించారు. ‘వీరంతా కలిసి ప్రజల రాజ్యాన్ని, రైతుల రాజ్యాన్ని, సంక్షేమ రాజ్యాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కూటమిని ప్రజలు ఓడించాలి. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలి.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి డబుల్ సెంచరీ స్థానాల్లో వైకాపాను గెలిపించేందుకు మీరు సిద్ధమేనా’ అని సభకు హాజరైనవారిని అడిగారు. ‘ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకోవడానికి మాత్రమే కాదు. ప్రజలు తమ తలరాతను మార్చుకునేందుకు కూడా’ అని వ్యాఖ్యానించారు. సొంత మీడియా సంస్థతోపాటు సామాజిక మాధ్యమాల్లో అన్ని వేదికలనూ విపరీతంగా వాడుకుంటూనే.. తనకు మీడియా మద్దతు లేదంటూ జనాన్ని నమ్మించేందుకు సీఎం మరోమారు ప్రయత్నించారు.
source : eenadu.net
Discussion about this post