అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో వ్యవసాయ మోటార్లకు జగనన్న స్మార్ట్ మీటర్ల ఏర్పాటును రైతులు అడ్డుకున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా శుక్రవారం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న రైతులు పొలాలకు చేరుకొని మీటర్ల ఏర్పాటును అడ్డుకున్నారు. బిగించిన కొన్ని మీటర్లను తీయించేశారు. ఈ విధానాన్ని దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినా, ఇక్కడ మాత్రం వైకాపా ప్రభుత్వం అమలు చేయడం దారుణమని రైతులు వాపోయారు. రైతుల నుంచి విద్యుత్తు బిల్లులు వసూలు చేయాలన్నదే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వారు ఆరోపించారు. 20 ఏళ్లుగా మీటర్లు లేకుండానే ఆయా ప్రభుత్వాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందిస్తే వైకాపా ప్రభుత్వం దానికి తూట్లు పొడిచేలా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎటువంటి షరతులు, స్మార్ట్ మీటర్లు లేకుండానే వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్తు అందించాలని వారు డిమాండ్ చేశారు.
source : eenadu.net
Discussion about this post