తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నారా లోకేశ్ తన ఇంటి నుంచి ప్రచారానికి వెళ్తుండగా ఆదివారం రెండుసార్లు ఆయన వాహనాలను ఉండవల్లి స్క్రూబ్రిడ్జి చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేయడం విమర్శలకు దారితీసింది. శుక్ర, శనివారాల్లో రోజుకు ఒకసారి తనిఖీ చేయగా ఆదివారం మాత్రం ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు చేయడంతో లోకేశ్ అసహనానికి గురయ్యారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఎస్సై శ్రీనివాసరావును ఉద్దేశించి.. ‘నా వాహనాల్ని ఈ ఒక్కరోజే రెండుసార్లు తనిఖీ చేయడం ఏమిటి? మిగిలిన వాహనాలు మీకు కనిపించడం లేదా? ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ఇటువైపే వచ్చివెళుతున్నారు కదా? ఏ రోజైనా వారి వాహనాలను ఆపి తనిఖీ చేశారా? నా ఒక్కడి వాహనాలనే ఎందుకు పరిశీలిస్తున్నారు’ అని నిలదీశారు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేస్తున్నామని ఎస్సై తెలపడంతో లోకేశ్ మరింత కోపోద్రిక్తులయ్యారు.
విపక్ష నేతలకు చెందిన వాహనాలే మీకు కనిపిస్తాయా.. నా వాహనాలను తనిఖీ చేయమని పై స్థాయిలో చెప్పిన ఆ అధికారి ఎవరంటూ లోకేశ్ తిరిగి ప్రశ్నించగా సదరు పోలీసు అధికారి.. అన్ని వాహనాలనూ తనిఖీ చేయాలని ఆదేశాలున్నాయంటూ మాటమార్చారు. ఉదయం తనిఖీ చేసిన సంగతి తనకు తెలియదని తాను అప్పుడు డ్యూటీలో లేనని చెప్పగా అసలు ఇన్నిసార్లు చేయడమేమిటి.. గతంలో నా వాహనాన్ని ఎప్పుడూ తనిఖీ చేయలేదు.. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని లోకేశ్ పట్టుబట్టారు. ‘రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటుగా ప్రయాణిస్తున్నారు. వారెవరి వాహనాలనూ తనిఖీ చేయడం లేదు. నిత్యం ఈచెక్‌పోస్టు మీదగానే మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలకు ప్రచారానికి వెళ్లే నా వాహనాల్ని ఆపి తనిఖీ చేయడం చూస్తుంటే ఉద్దేశపూర్వంగా జరుగుతున్నట్లుగా ఉంది. ఇది ఓ రకంగా వేధింపులకు గురిచేయడమే’ అని లోకేశ్ మీడియాతో పేర్కొన్నారు.
‘కేవలం తెదేపా, జనసేనకు చెందిన అభ్యర్థులు, నేతల వాహనాలనే ఆపి తనిఖీ చేయాలని ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని సాక్షాత్తు ఎస్సై చెప్పారు. చట్టం అంటే అందరికీ ఒకేలా ఉండాలి. రాష్ట్రంలో అది లోపించింది. డీజీపీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రభుత్వ అధికారిగా పనిచేయడం లేదు. విపక్షాలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయం. ఆయన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో డీజీపీ ఆదేశాలను అనుసరించి గుంటూరు ఎస్పీ వివక్షత చూపుతున్నారు. డీజీపీ, ఎస్పీని తక్షణమే విధుల నుంచి తప్పించాలని కోరుతున్నా. దీనిపై మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. కచ్చితంగా డీజీపీ, ఎస్పీని మార్చే వరకు పోరాడతాం’ అని లోకేశ్ స్పష్టం చేశారు.
వైయస్‌ఆర్ జిల్లాలో వైకాపా నేతల భూ దాహానికి ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంపై విలేకరులు ప్రశ్నించగా ‘ఈ ప్రభుత్వంలో ఎంతోమంది బీసీలు ఆత్మహత్య చేసుకున్నారు. హత్యలకు గురయ్యారు. దళితులదీ అదే పరిస్థితి. రేపల్లెకు చెందిన ఉప్పాల అమరనాథ్ గౌడ్‌ను కిరాతకంగా చంపారు. ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. మైనార్టీలపై దాడులు చేస్తున్నారు. ఈ మొత్తానికి సైకో జగనే కారణం. ఆయన పాలన పోతేనే ప్రజలకు మేలు జరుగుతుంది. విశాఖ డ్రగ్స్ వ్యవహారాన్ని తెదేపాకు అంటగడుతున్నారు. అందుకు ఆధారాలేమిటి? బ్రెజిల్ అధ్యక్షుడికి ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చింది? ఇవన్నీ త్వరలోనే తేలతాయి’ అని లోకేశ్ వివరించారు.

source : eenadu.net
Discussion about this post