ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 8 డిమాండ్లను నెరవేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లకు ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తిచేశారు. పార్లమెంటు ప్రాంగణంలో వారిద్దరినీ ఆయన కలిసిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి శాలువా కప్పి, వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహూకరించి వివిధ అంశాలపై చర్చించినట్లు అందులో పేర్కొంది. ఈ పర్యటనలో హోంమంత్రి అమిత్‌షాను సీఎం జగన్ కలవలేదు.
ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలోని వివరాలు
పోలవరం ప్రాజెక్టులో కాంపొనెంట్ వారీగా సీలింగ్ ఎత్తేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించింది. దీంతోపాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911 కోట్ల విడుదలకూ అంగీకరించింది. ఈ రెండు అంశాలూ కేంద్ర కేబినెట్ ఆమోదానికి ఎదురు చూస్తున్నాయి. దీనిపై వెంటనే దృష్టిపెట్టాలి.
పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చవుతాయి. ఇప్పటికే ఈ ప్రతిపాదన జలశక్తిశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలి.
2014 జూన్ నుంచి మూడేళ్లపాటు తెలంగాణకు ఏపీ జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్తుకు రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వెంటనే చెల్లించేలా చూడాలి.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేకహోదా సహా ఇతర హామీలనూ అమలుచేయాలి. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేకహోదా అవసరం. దానివల్ల పెట్టుబడులతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయి.
రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించాం. ప్రతి జిల్లాకు ఒక వైద్యకళాశాల ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నాం. ఇప్పటికే కొన్నింట్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. కళాశాలల ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలి.
విశాఖ నగరాన్ని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్లరహదారికి సహాయ సహకారాలు అందించాలి.
విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం-కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను కడప మీదుగా బెంగళూరు వరకూ పొడిగించాలి. దీనిపై పరిశీలన పూర్తిచేసి, ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలి. కడప-పులివెందుల-ముదిగుబ్బ-సత్యసాయి ప్రశాంతి నిలయం-హిందూపూర్ మీదుగా కొత్త రైల్వేలైన్ చేపట్టాలి.
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి బయటికొచ్చిన ఏపీ ముఖ్యమంత్రిని జాతీయ మీడియా పలకరించింది. చర్చల సారాంశం ఏంటని అడిగితే నవ్వుతూ నమస్కరించారు. అలాగే ఏకైక తెలుగు ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన అంశాన్ని ప్రస్తావించి.. దానిపై మీ స్పందన ఏంటని అడిగినప్పుడు కూడా ఆయన ఏమీ మాట్లాడకుండా.. కేవలం నమస్కరిస్తూ వెళ్లిపోయారు.
source : eenadu.net
Discussion about this post