విశాఖలో ఆడుదాం ఆంధ్రా ఫైనల్ మ్యాచ్‌లు
రైల్వే స్టేడియంలో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం
ఐదు క్రీడాంశాల్లో తలపడనున్న 26 జిల్లాల జట్లు
ముగింపు వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్
మహా క్రీడా సంబరానికి విశాఖ సర్వం సిద్ధమైంది. గ్రామీణస్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’తుది ఘట్టానికి చేరుకుంది. నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా.. జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహా సంగ్రామం జరగనుంది.
విశాఖ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. ఇక 13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. కాగా చైన్నె సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ జట్లకు శిక్షణాపరమైన సహకారం అందించిన నిపుణులు ఈ పోటీలను వీక్షించేందుకు రానుండటం విశేషం. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఎంపిక చేసి, వీరితో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ;ఏర్పాట్లు చేసింది.
40 బస్సులు సిద్ధం
జిల్లా స్థాయిలో విజయం సాధించిన జట్లు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి. ప్రతీ జిల్లా నుంచి 134 మంది చొప్పున మెన్, వుమెన్ పోటీలకు హాజరవుతున్నారు. రైళ్లలో కొందరు, బస్సుల్లో మరికొందరు విశాఖలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకున్నారు. రైళ్లలో వచ్చిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో బస వద్దకు చేర్చారు. ఐదు రోజుల పాటు క్రీడాకారులను బస ప్రాంతం నుంచి మైదానాల వద్దకు తరలించేందుకు 40 బస్సులను సిద్ధం చేశారు.
పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు ఇవే..
జిల్లా స్థాయిలో మెన్ విభాగం క్రికెట్ పోటీల్లో నక్కవానిపాలెం, బ్యాడ్మింటన్‌లో సుసర్ల కాలనీ–1 జట్టు, వాలీబాల్‌లో ప్రశాంతినగర్, కబడ్డీలో ఓల్డ్ అయ్యన్నపాలెం, ఖోఖోలో సాకేత్‌పురం–1 జట్లు విజేతలుగా నిలిచాయి. మహిళా విభాగం క్రికెట్‌లో వాంబే కాలనీ–6, బ్యాట్మింటన్‌లో పెదవాల్తేర్–2, వాలీబాల్‌లో రజకవీధి–1, కబడ్డీలో లాసన్స్‌బే కాలనీ, ఖోఖోలో లంకెలపాలెం జట్లు విజేతలుగా నిలిచి.. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాయి.
source : sakshi,com
Discussion about this post