రాష్ట్రంలోని విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని, విద్యలో నాణ్యత పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. నాణ్యమైన విద్యా హక్కు ఇప్పుడు నినాదంగా మారిందని, ప్రపంచంతో పోటీ పడకపోతే భవిష్యత్తు మారదని వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ఎడెక్స్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఉపకులపతులతో జగన్ ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ.. ‘‘ఎడెక్స్‌తో ఒప్పందంలో భాగంగా 2,000కు పైగా కోర్సులు పాఠ్యప్రణాళికలో విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. హార్వర్డ్, ఎంఐటీ వంటి సంస్థలు అందించే కోర్సులు నేర్చుకోవచ్చు. వాటిలో సాధించే క్రెడిట్స్ పాఠ్యప్రణాళికలో భాగమవుతాయి. దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. వాటి కోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సంప్రదాయంగా మన దగ్గర అందుబాటులో ఉన్న కోర్సులు కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్ వంటి కోర్సులు పాశ్చాత్య దేశాల్లో డిగ్రీలో భాగంగా కనిపిస్తాయి. మన దగ్గర ఇవేమీ కనిపించవు. రాబోయే రోజుల్లో ఏఐ, అగ్‌మెంట్ టెక్నాలజీ, త్రీడీ లెర్నింగ్ వంటి వాటిని కరిక్యులమ్‌లో అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఉపకులపతి ఎడెక్స్ కోర్సులపై దృష్టిపెట్టాలి. పద్మావతి విశ్వవిద్యాలయంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిస్థాయిలో వినియోగానికి చర్యలు తీసుకున్నారు. ఇలాంటి చర్యలు ప్రతి వర్సిటీ తీసుకోవాలి. టెక్నాలజీని మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఈ దిశగా ఉపకులపతులు అడుగులు వేయాలి’’ అని సూచించారు.
‘‘విద్యార్థులు పోటీ పడేది పక్క రాష్ట్రాలు, ఈ దేశంలో ఉన్న వారితో కాదు.. ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం. మంచి జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలంటే విద్యలో నాణ్యత అంతర్జాతీయ సంస్థల ప్రమాణాలతో నిలబడగలగాలి. ప్రాథమిక విద్య నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ ప్రారంభించనున్నాం. ఆరో తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెడుతున్నాం. ఉన్నత విద్యలోనూ ఇవే అడుగులు వేస్తేనే పిల్లలు గ్లోబల్ సిటిజన్స్‌గా తయారవుతారు. ఉద్యోగాల సాధనే ధ్యేయంగా పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,295 పోస్టులు భర్తీ చేసే ప్రయత్నం వేగంగా సాగుతోంది. 437 విద్యా సంస్థలకు న్యాక్ గుర్తింపు లభించింది’’ అని వెల్లడించారు.
source : eenadu.net
Discussion about this post