వరుసగా రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టిన నియోజకవర్గ ప్రజలకు ఒక్క మంచి పనికూడా చేయకుండా రూ.వేల కోట్లను దోచుకుని నేడు ప్రజల్లోకి ఎలా వచ్చి ఓట్లు అడుగుతున్నారంటూ పరిటాల సునీతపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎంపీపీ సుబ్బర హేమలతతో కలసి సోమవారం భారీ జనసందోహం మధ్య ఆత్మకూరులో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రౌడీషీటర్లతో ప్రచారం చేపట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలనుకోవడం సునీత అవివేకానికి నిదర్శనమన్నారు. ఎంతమంది రౌడీలు వచ్చినా భయపడేది లేదన్నారు. ఆత్మకూరును ఆదాయ వనరుగా మార్చుకుని రూ.కోట్లకు పడగలెత్తారన్నారు. చేసిన అక్రమాలు ఏవీ ప్రజల మదిలో నుంచి చెరిగిపోలేదన్నారు. టీడీపీ హయాంలో వారు చేసిన, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తాను సాధించిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని పరిటాల సునీత, శ్రీరామ్‌తో పాటు చంద్రబాబుకు సవాల్ విసిరారు. మంత్రిగా ఉన్న సమయంలో కనీసం తాగునీటి సమస్యను సైతం పరిష్కరించలేని అసమర్థులు నేడు ప్రజలను మభ్య పెట్టేందుకు వస్తున్నారని, వారి కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
దశాబ్దాలుగా అధికారాన్ని వెలగబెట్టినా పరిటాల కుటుంబం సొంత మండలంలోని పేరూరు డ్యాంకు కనీసం నీటి బొట్టును కూడా అందివ్వలేకపోయిందన్నారు. ఒక్క రూపాయి ఖర్చులేకుండా నీరు ఇవ్వవచ్చని ఆధారాలతో తాను చెప్పినా వినకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.800 కోట్లతో టెండర్లు పిలిచి రూ.30 కోట్లు కమీషన్లు దండుకున్న నీచమైన చరిత్ర పరిటాల సునీతదన్నారు. గతంలో మంత్రిగా ఉన్న పప్పు లోకేష్ రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి రూ.వంద కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.3 కోట్లకు అమ్ముకున్నారని, ఆ తర్వాత కంపెనీకి పరిటాల కుటుంబానికి బేరాలు కుదరకపోవడంతో 2018లోనే జాకీ పరిశ్రమ సేలం వెళ్లిపోయిందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా చేసింది పరిటాల కుటుంబమేనన్నారు. పేరూరు డ్యాంలోకి నీరు చేరకుండా ఉపరితలంలో నాగలమడక రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిటాల రవి పూర్తి చేయించారని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత చేసిన మంచి పనులు చెప్పుకునేందుకు బోలెడు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి సంవత్సరంలోనే ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ సీఎం జగనన్న ఆసీస్సులతో పేరూరు డ్యాంకు నీరు అందించామన్నారు. రామగిరి బంగారు గనులు తెరిపించేందుకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చినట్లు గుర్తు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.117 కోట్లతో నియోజకవర్గంలోని 110 గ్రామాలకు శాశ్వత నీటి పథకాలు ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 17 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించామన్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు. 4 వేల మంది రైతులకు ఉచిత బోర్లు వేయించామన్నారు. అధికారంలోకి వస్తే మరో 6 వేల మందికి ఉచిత బోర్లు వేయిస్తామని భరోసానిచ్చారు. ఆత్మకూరు మండలానికి రెండు విద్యుత్ సబ్‌స్టేషన్‌లు తీసుకువచ్చామన్నారు. కేవలం ఆత్మకూరుకు మాత్రమే తాగునీటి కోసం రూ.కోటి ఖర్చు చేసినట్లు వివరించారు. తోపుదుర్తి రిజర్వాయర్‌కు కృషి చేస్తున్నామన్నారు. ఏటా ఎకరాకు రూ.30 వేలు కౌలు చెల్లించేలా సోలార్ ప్లాంట్‌ను తీసుకువచ్చామన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వంద శాతం సీసీ రోడ్లు పూర్తి చేస్తామన్నారు. అమ్మ డెయిరీ ద్వారా 10 వేల మంది పాడి మహిళా రైతులకు ఉపాధి కల్పించామన్నారు. మళ్లీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ది చేస్తానని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌కు అవకాశం కల్పించాలని కోరారు.
source : sakshi.com
Discussion about this post