గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం, అసెంబ్లీ స్థానాలకు వైకాపా తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులను శుక్రవారం గుంటూరులో జరిగిన సభలో సీఎం జగన్ పరిచయం చేస్తూ.. ఉత్సాహవంతులని, సౌమ్యులని పరిచయం చేశారు. గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న విడదల రజని నిజంగా స్థానికురాలంటూ నొక్కి చెప్పారు. మంగళగిరి నుంచి స్థానికురాలు, ప్రజలకు అందుబాటులో ఉండే లావణ్య పోటీ చేస్తున్నారని చెప్పారు. మంచి చేయడానికి వీరంతా ముందుకొచ్చారని జగన్ చెప్పడంపై.. అవునా? వీరంతా అంత మంచివారా అని సీఎం ప్రసంగాన్ని విన్న స్థానికులు విస్తుపోతున్నారు.
గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిలారు రోశయ్య మంచివాడు, సౌమ్యుడని జగన్ కితాబిచ్చారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పరిచయం చేశారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న రోశయ్యకు ఓటేయమని అడిగే ముందు అయిదేళ్లుగా పొన్నూరు నియోజకవర్గాన్ని కొల్లగొట్టిన నేతలెవరో ఆయనకు తెలుసేమో కాస్త కనుక్కోండి జగన్.. అని ప్రజలు అడుగుతున్నారు. మట్టి, ఇసుక, రేషన్ దోపిడీ సంగతేంటో, అయిదేళ్లుగా రూ.వందల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో.. కాస్త మీ ‘సౌమ్యుడిని’ కనుక్కొని చెప్పండయ్యా అని కోరుతున్నారు. ‘పొన్నూరును రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డాగా మార్చి.. మాఫియాను పెంచి పోషించారు. దళిత యువకుడు అంజి బర్నబాస్‌ను కారుతో ఢీకొట్టి కిడ్నాప్ చేసి.. అతి దారుణంగా హత్య చేయడంలో పాత్ర ఎవరిది? ప్రతి నెలా రూ.6లక్షల చొప్పున ముడుపులు తీసుకునేదెవరు? ఎర్ర గ్రావెల్ అక్రమ తవ్వకాలతో రూ.వందల కోట్లు సంపాదించినదెవరు? ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు ఎవరికి అందుతున్నాయి. శేకూరులో వంద అడుగుల లోతులో క్వారీ చేసి దోచుకుంటోందెవరు? కొత్తగా చేపట్టే ప్రతి నిర్మాణానికీ అంతస్తుకు రూ.లక్ష చొప్పున రేటు కట్టిందెవరు? పేదల కోసం గత ప్రభుత్వం తెచ్చిన ఆదరణ పరికరాలను రూ.15 లక్షలకు అమ్ముకునేంత నీచానికి పాల్పడిందెవరు’ ఇవన్నీ చేసిందెవరో మీ మంచివాడిని ఆరా తీసి చెప్పండని జగన్‌కు స్థానికులు సూచిస్తున్నారు. ‘విద్యుత్తు ఉపకేంద్రం, శిశుసంక్షేమ శాఖలో సూపర్‌వైజర్ పోస్టులను అమ్ముకున్నదెవరు? అధికారుల బదిలీలకు రూ.3లక్షల నుంచి రూ.10లక్షల వరకూ రేటు కట్టి దోచుకున్న ఘనులెవరు? బార్ల యజమానుల నుంచి సొమ్ములు వసూలు చేసిందెవరు? వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతరంగా మార్చాలంటే ఎకరానికి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకూ దోచుకుంటున్నారు. మరి సౌమ్యుడి నియోజకవర్గంలో ఇవన్నీ ఎవరు చేస్తున్నారబ్బా?’ అని గుంటూరు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
అయిదేళ్లుగా తెనాలి ఎమ్మెల్యేగా పనిచేసిన మీ స్నేహితుడు అన్నాబత్తుని శివకుమార్‌కు అక్కడ జరిగిన అరాచకాలకు కారకులెవరో, వాటి ద్వారా రూ.వందల కోట్లు వెనకేసుకున్నదెవరో తెలిసే ఉంటుంది కదా? అవన్నీ అన్నవైన మీకు చెప్పకుండా ఉంటారా? వారెవరో జనం ముందే ప్రకటించి ఓటేయమని అడగండి జగన్ అని తెనాలి ప్రజలు కోరుకుంటున్నారు. ‘జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమి ద్వారా రూ.81 కోట్లు దోచేశారు. భూమి చదును పేరుతో మరింత దండుకున్నారు. ఇసుక అక్రమ రవాణా పేరుతో రూ.50 కోట్లు వెనకేశారు. అక్రమ తవ్వకాలు, రవాణాపై ప్రశ్నించే వారిని ట్రాక్టర్లతో తొక్కించి కత్తులతో బెదిరించి భయానక వాతావరణం సృష్టించారు. స్వార్థం కోసం పచ్చని గ్రామాల్లో గొడవలు, ఆందోళనల చిచ్చు రేపారు. వెంచర్లు వేయాలన్నా.. నిర్మాణాలు చేయాలన్నా.. నియోజకవర్గంలో ప్రతి పనికీ కప్పం కట్టించుకుంటున్నారు. రౌడీషీటర్లను అడ్డం పెట్టి సెటిల్‌మెంటు చేయించారు. బ్రిక్స్ ఇండస్ట్రీ పెట్టి.. ఎవరికి ఇటుకలు కావాలన్నా తమ దగ్గరే కొనాలనే నిబంధన పెట్టి అమ్మారు. అలా కొనలేని వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చివరకు మున్సిపల్ శతాద్ది ఉత్సవాలనూ వదల్లేదు. ఇంత సౌమ్యుడున్న నియోజకవర్గంలో ఇవన్నీ ఎవరు చేశారో ఆయనకు తెలియకుండా ఉంటుందా? కాస్త చెప్పండి జగన్’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
source : eenadu.net
Discussion about this post