రాష్ట్ర విభజన అంశం.. ప్రత్యేక హోదా విషయం.. పార్టీ లతో పొత్తుల వ్యవహారం.. ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మాటలు మార్చుతూ రాజకీయాల్లో ‘యూ టర్న్’ నాయకుడిగా చంద్రబాబు ఎక్కువ ప్రాచుర్యం పొందారు. ఇప్పుడు అచ్చు గుద్దినట్టు చంద్రబాబు మాదిరే రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్ రికార్డుల మోత మోగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు అన్ని అంశాలలోనూ ఎప్పటికప్పుడు మాట మార్చుతూ తాను ‘నయా యూ టర్న్’ నేతనని నిరూపించుకుంటున్నారు.
నలభై ఏళ్ల అనుభవంలో చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటే.. పార్టీ పెట్టి ఆరీ తీరీ పదేళ్లు కాకుండానే అన్ని పార్టీలతో పవన్ పొత్తులు పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడు ఏ విషయంపై ఏం మాట్లాడుతారోనని రాజకీయ విశ్లేషకులే నిర్ఘాంతపోతున్నారు. గాలి వాటంగా వ్యవహరించే ఆయన ఎప్పుడు ఏ పార్టీ తో పొత్తు పెట్టుకుంటారో కూడా ఎవరికీ అంతుపట్టడం లేదంటున్నారు.
పవన్ కేవలం ఒక్క వలంటీర్లకు సంబంధించిన అంశంలోనే కాదు.. అనేక సందర్భాల్లో అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట మార్చుతూ తనకు చాలా నాలుకలున్నాయని రుజువు చేస్తున్నారు. అమరావతి రాజధాని, కాపు రిజర్వేషన్ల అంశంతోపాటు అనేక కీలక అంశాలన్నింటిలోనూ జనసేనాని రాజకీయ వైఖరి పూర్తి యూ టర్న్ అన్న రీతినే సాగుతోంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించినప్పుడు పాచిపోయిన లడ్డూలంటూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబుపై 2014లో ఒకలా, 2019లో మరోలా, ఇప్పుడు ఇంకోలా మాట్లాడారు. తన కుటుంబాన్ని, తన తల్లిని కించపరిచేలా మాట్లాడిన టీడీపీ నేతల సంగతి చెబుతానన్న పవన్.. ఇప్పుడు వారితోనే చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు.
source : sakshi.com
Discussion about this post