ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కచ్చితంగా ‘బ్రాండ్ వ్యాల్యూ’ ఉండాలి. ప్రభుత్వంపై విశ్వసనీయత ఆధారంగా ఆ బ్రాండ్ వ్యాల్యూ పెరుగుతుంది. జగన్ ప్రభుత్వం మాత్రం .. పారిశ్రామికవేత్తల వేధింపులను మన రాష్ట్రానికి బ్రాండ్ వ్యాల్యూగా మార్చేసింది! వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత విద్యుత్ పీపీఏల సమీక్ష పేరుతో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు స్థలాలను కేటాయించగా.. ‘భూముల సమీక్ష’ పేరుతో కక్ష గట్టి పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురిచేసింది. ఫలితంగా పెట్టుబడిదారులు సుమారు రూ.1.24 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఉపసంహరించుకుని.. రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితులను కల్పించింది. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలంటేనే వణికిపోయే వాతావరణాన్ని జగన్ ప్రభుత్వం సృష్టించింది. ఇప్పటికే ఉన్న పరిశ్రమలను రాజకీయ కక్షలతో తనిఖీల పేరుతో వేధించింది.
జగన్ ప్రభుత్వ వేధింపులతో అమరరాజా బ్యాటరీస్ సంస్థ.. తన రూ.9,500 కోట్ల ప్రతిపాదిత విస్తరణ ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటుచేయాలని నిర్ణయించుకుంది. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న పరిశ్రమ పొరుగు రాష్ట్రం వైపు ఎందుకు చూసింది? పెట్టుబడిదారులకు రాష్ట్రం గురించి ఎలాంటి సంకేతాలు వెళ్లాయి? నిరుద్యోగ యువతను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది? అన్న అంశాలను దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పరిశ్రమలు ఏర్పాటు కాకపోతే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మందగిస్తుందన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు వైకాపా సర్కారు. కేవలం తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న రీతిలో వ్యవహరించింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ వ్యాల్యూను దెబ్బతీసింది. వెరసి.. రాష్ట్రానికి గత ఐదేళ్లలో పెట్టుబడులు రావడమే గగనమైంది. ఓ మోస్తరు పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను వేళ్ల మీద లెక్కించొచ్చు!
తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ.. లైఫ్‌సైన్సెస్ క్యాపిటల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందడంతోపాటు ఐటీ హబ్‌గానూ అంతర్జాతీయంగా గుర్తింపు సాధించింది. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ ఫర్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ‘జీనోం వ్యాలీ’ మెడికల్ డివైసెస్ పార్క్, బయోఫార్మా హబ్ కూడా తెలంగాణలో ఉంది. కొవిడ్ టీకా తయారీతో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు గొప్ప గుర్తింపు వచ్చింది. దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 30 శాతం తెలంగాణ నుంచే ఉన్నాయి. దీనికి చుట్టుపక్కల సుమారు 800 లైఫ్‌సైన్సెస్ కంపెనీలు ఉన్నాయి. ప్రధానంగా ఐటీ రంగం విస్తరణకు అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే ప్రపంచ దేశాల పెట్టుబడిదారులు ఆ రాష్ట్రం వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. ఇదీ.. తెలంగాణ సాధించిన బ్రాండ్ వ్యాల్యూ.
source : eenadu.net
Discussion about this post