తాజా, మాజీ విద్యాశాఖ మంత్రుల సమరానికి విజయనగరం జిల్లా చీపురుపల్లి వేదిక కానుందా? తెదేపా వ్యూహం చూస్తే అలాగే కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో వైకాపా సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణను వచ్చే ఎన్నికల్లో ఢీ కొట్టాలంటే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావే సరైన అభ్యర్థి అని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. దీనిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది. చీపురుపల్లి నుంచి శాసనసభకు నాలుగుసార్లు పోటీ చేసిన బొత్స సత్యనారాయణ.. మూడుసార్లు విజయం సాధించారు. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ ఆయన పోటీ దాదాపు ఖాయమైంది. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. 1999లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు, 2004లో చోడవరం, 2009లో అనకాపల్లి, 2014లో భీమిలి, 2019లో విశాఖపట్నం ఉత్తరం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన ఎక్కడ పోటీ చేసినా వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. చీపురుపల్లిలో గంటాను బరిలోకి దింపడం ద్వారా.. మంత్రి బొత్సను ఓడించాలని తెదేపా అధిష్ఠానం ఆలోచించింది. గంటా అయితే బలమైన అభ్యర్థి అవుతారని, తెదేపా విజయం సాధించే అవకాశం ఉంటుందని సర్వేల్లోనూ తేలినట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీకి చీపురుపల్లి నియోజకవర్గం ఒకప్పుడు పెట్టని కోట. 1983లో తెదేపా ఆవిర్భావం నుంచి.. 1999 ఎన్నికల వరకు అక్కడ సైకిల్‌కు ఎదురులేదు. 1994, 1999 ఎన్నికల్లో గద్దె బాబూరావు వరుసగా గెలుపొందారు. బొత్స సత్యనారాయణ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కిమిడి మృణాళిని 20 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో.. కాంగ్రెస్ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై గెలిచారు. 2019లో వైకాపా నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ 26 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచి, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూస్తే 1983 నుంచి 9 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఆరుసార్లు తెదేపా, రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బొత్స, గంటా తలపడితే.. తాజా, మాజీ విద్యాశాఖ మంత్రుల పోరుకు చీపురుపల్లి వేదిక అవుతుంది.
source : eenadu.net
Discussion about this post