ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి సారిగా ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్న ఆరు గ్యారంటీలపై గట్టిగా స్పందించారు. ఇంతకాలం చంద్రబాబు ప్రజల వద్దకు వచ్చి బెంజ్ కారు ఇస్తానని అంటారని, కిలో బంగారం ఇంటింటికి ఇస్తానని చెబుతారని, అలాంటి మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని ప్రజలకు చెబుతుండేవారు. కాని ఈసారి శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం చెబుతూ సవివరంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వాగ్దానాలలో ఎంత డొల్ల ఉన్నది ఆయన స్పష్టంగా తెలిపారు. తాను అమలు చేస్తున్న స్కీములకు డబ్బైరెండువేల కోట్ల వ్యయం అవుతోంందని, దాంతో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు అంతకు రెండు, మూడు రెట్ల వాగ్దానాలు చేస్తున్నారని, వాటికి లక్షాపాతికవేల కోట్ల నుంచి లక్షాఏభై వేల కోట్ల వ్యయం అవతుందని, అప్పుడు ఏపీ ఎన్ని శ్రీలంకలు అవ్వాలని జగన్ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు చంద్రబాబు నుంచికాని, ఆయనను భుజాన వేసుకుని మోసే మీడియాల నుంచి కాని సూటిగా సమాదానం లభించదు. చంద్రబాబు సంపద సృష్టించి స్కీములు అమలు చేస్తారని బొల్లుతుంటారు. దానిని చాలా స్పష్టంగా రుజువు చేస్తూ జగన్ అసెంబ్లీలో అంకెలను ప్రదర్శించి మరీ తెలియచెప్పారు. ఈ మాట అంటుంటే ఒక సంగతి గుర్తుకు వస్తుంది. చంద్రబాబు నాయుడు 1995-2004 మధ్య ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 54 ప్రభుత్వరంగ సంస్థలను మూసివేశారు. అవన్ని నిరర్దకమని, నష్టాలు తెచ్చేవని అప్పట్లో ప్రభుత్వపరంగా చెప్పేవారు. అలాగే విద్యుత్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. వాటివల్ల ప్రజలపై భారం పెరిగేది. ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వాలంటే పలు షరతులు పెట్టేది. విద్యుత్ రంగంలో నష్టాలు తగ్గించాలని, రేషన్ కార్డులు కట్ చేయాలని, నష్టాలలో ఉన్న ప్రభుత్వ సంస్థలను ఎత్తివేయాలని ..ఇలా పలు కండిషన్ లు పెడితే అందుకు చంద్రబాబు ఒప్పుకున్నారు.
ఆ రోజుల్లో కూడా ఆయన ఇదే సంపద సృష్టి అంటూ బడాయి పదాలు వాడేవారు. విద్యుత్ సంస్కరణల వల్ల చాలా సొమ్ము ఆదా అవుతుందని,దానిని పేదలకు వ్యయం చేస్తామని అనేవారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చేవారు. దీనిపై చంద్రబాబు విమర్శిస్తూ,అలాగైతే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని అనేవారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత పెరిగి 2004 ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలైంది. ఉమ్మడి ఏపీలో 47 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులోను తెలంగాణలో అతి తక్కువగా 11 సీట్లే టీడీపీకి దక్కాయంటే ఏ స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారో అర్ధం చేసుకోవచ్చు. విశేషం ఏమిటంటే ఆ తర్వాత రోజులలో ఆయన అన్ని విషయాలలో యుటర్న్ తీసుకున్నారు.
source : sakshi.com
Discussion about this post