జగన్ ప్రభుత్వంలో ప్రజలకు సురక్షితమైన నీరు కరవైంది. కలుషిత నీరు ప్రజల ప్రాణాలు తోడేస్తోంది. ఇది వైకాపా ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ఠ కాక ఇంకేమిటి? ఏటా ఆస్తి పన్ను పెంచుతూ, చెత్త సేకరణకు సైతం ప్రతి నెలా ప్రజల నుంచి రుసుములు వసూలు చేస్తూ బాదేస్తున్న జగన్ ప్రభుత్వానికి ప్రజల బాధలు మాత్రం పట్టడం లేదు.
గుంటూరులో కలుషిత నీరు తాగి అనారోగ్యంతో గిరిజన యువతి మృతి చెందటం, మరో 25 మంది ఆసుపత్రుల్లో చేరడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. పుర, నగరపాలక సంస్థలు సరఫరా చేస్తున్న నీటిలో.. తాగునీటి అవసరాలకు అత్యధికంగా వినియోగిస్తున్నది నిరుపేదలే. వీరి ఆరోగ్యంపట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఇదేనా? కలుషిత నీటికి కారణమవుతున్న పాడైన పాత పైపులైన్ల స్థానంలో కొత్తవి వేసే తీరిక కూడా ప్రభుత్వానికి లేదా? కలుషిత నీటితో ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలి? సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే…మిగతా జిల్లాల్లో తాగునీటి సరఫరా ఇంకెంత దారుణంగా ఉందో?..ఊహించవచ్చు.
తుప్పు ముప్పుపై నిర్లక్ష్యం…!
నగరాలు, పట్టణాల్లో పాడై తుప్పుపట్టిన పైపుల్లో సరఫరా చేస్తున్న తాగు నీరు ప్రజలకు ప్రాణసంకటంగా మారుతోంది. కాలువల్లో ఉంటున్న తాగునీటి పైపులకు పడిన రంధ్రాల్లోకి మురుగునీరు చేరి కలుషితమై ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో 18,240 కిలో మీటర్ల మేర తాగునీటి పైపులైన్లలో 40% వరకు నాలుగైదు దశాబ్దాల క్రితం వేసినవే. పాతికేళ్లకోసారి వీటిని మార్చడం ద్వారా కలుషిత నీటి సమస్యను పరిష్కరించొచ్చని నిపుణులు చెబుతున్నారు. తాగునీటి సరఫరాను మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్‌కి రాష్ట్ర వాటా నిధులివ్వకుండా జగన్ ప్రభుత్వం పక్కన పెట్టింది. తుప్పుపట్టిన పైపులైన్లు మార్చే ప్రయత్నమూ చేయడం లేదు. సీఎం సమీక్షల్లో ఆదేశాలు తాడేపల్లి కార్యాలయం దాటి బయటకు వెళ్లడం లేదు. యథా రాజా..తథా అధికారులు అన్నట్లుగా ఉంది పరిస్థితి.
గత ప్రభుత్వ కార్యక్రమంపై అక్కసు
పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గత తెదేపా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మౌలిక సదుపాయాల పెట్టుబడుల ప్రణాళిక(సీఐఐపీ)ను జగన్ ప్రభుత్వం అటకెక్కించింది. ఈ కార్యక్రమంలో ఏటా రూ.6 వేల కోట్లు ఖర్చు చేయాలన్నది ప్రణాళిక. పాడైన తాగునీటి పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయడం, రహదారులు, కాలువలు మరమ్మతులు చేయడం, ఇతర అత్యవసర పనులకు, ప్రజలకు అదనపు సదుపాయాలు కల్పించాలన్న గత ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచారు. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పుర, నగరపాలక సంస్థల పీడీ ఖాతాల నుంచి బిల్లులు సకాలంలో చెల్లించని కారణంగా నగరాలు, పట్టణాల్లోనూ పనులు చేయడానికి గుత్తేదారులూ ముందుకు రావడం లేదు. దీంతో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో పాడైన పాత తాగునీటి పైపులైన్లు కలుషిత నీటికి కారణమవుతున్నాయి.
source : eenadu.net
Discussion about this post