ఖాతాల్లో ఎంతకీ డబ్బులు పడవేం?
ఆసరా నాలుగో విడత కోసం ఎదురుచూపులు
ఉసూరుమంటున్న లబ్ధిదారులు
రెండేళ్లుగా వివిధ పథకాలది ఇదే తంతు
మనం నొక్కితే ఠంచన్…
మనం బడ్డీ కొట్టుకో, కిరాణా దుకాణానికో వెళ్లి… ఏదైనా కొని, సెల్‌ఫోన్ నుంచి ఫోన్‌పే/గూగుల్‌పే ద్వారా చెల్లిస్తే మన ఖాతా నుంచి డబ్బులు ఎంతసేపటికి కట్ అవుతాయి… కళ్లు మూసి తెరిచేలోగానే కదా.. ఇది అందరికీ ఎదురయ్యే అనుభవమే కదా…!
అదేం విచిత్రమో మరి…
సీఎం జగన్ బటన్ నొక్కితే మాత్రం నవరత్న లబ్ధిదారుల ఖాతాల్లో ఎంతకీ డబ్బులు జమ కావడం లేదు. ఒక్కోసారి 12 నెలలు కూడా పడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వేల మంది సమక్షంలో… ఆయన నొక్కిన బటన్ సరిగా పనిచేయడం లేదో? ఒకవేళ అది ఉత్తుత్తిదో అర్థమే కావడం లేదని లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు.
ఆసరా, అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన… మరే ఇతర పథకానికి సంబంధించిన నిధుల విడుదల కార్యక్రమమైనా జగన్ వేదిక మధ్యలో నిల్చుంటారు. చుట్టూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఉంటారు. సభికులంతా చూస్తుండగా సీఎం ల్యాప్‌టాప్‌పై బటన్‌ను నొక్కేస్తారు. వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నట్లు… అక్కడే ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్ మీద చూపించేస్తారు. డబ్బులు సెకన్లలోనే లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లిపోతాయనుకుంటున్నారా? లేనేలేదు. పోనీ… ఆ తర్వాత రోజో, లేదా మరుసటి రోజో కూడా జమకావు. అవి ఖాతాల్లోకి వచ్చాయేమోనని రోజుల తరబడి లబ్ధిదారులు వందలసార్లు తమ ఖాతాలను చెక్ చేసుకోవాల్సిందే. కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. పోనీ ఎప్పటిలోగా జమవుతాయో కచ్చితంగా చెబుతారా? అంటే అదీ లేదు. ఎప్పుడు ఖాతాల్లో పడితే అప్పుడు హమ్మయ్య…! అనుకోవాల్సిందే. రెండేళ్లుగా చాలా పథకాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్న తీరు ఇదే.
సాంకేతిక సమస్యలంటూ సాకులు
గతేడాది ‘అమ్మఒడి‘ నిధులు… జగన్ విడుదల చేసిన 30 రోజుల తర్వాత ఖాతాల్లోకి వచ్చాయి. సాంకేతిక సమస్యలంటూ జాప్యాన్ని కొనసాగించారు. చేదోడు, నేతన్ననేస్తం, విద్యాదీవెన, వసతిదీవెన, డ్వాక్రా సున్నా వడ్డీ రాయితీ పథకాలకు సంబంధించిన నిధుల విడుదల తీరూ ఇంతే. కనీసం నెల రోజులు పట్టాలంతే. ఆఖరికి వాలంటీర్లకు ఇచ్చే నగదు పారితోషికాల విడుదలలోనూ విపరీత జాప్యమే జరుగుతోంది.
నిధులన్నీ ఏమవుతున్నట్లు?
ఏడాది ప్రారంభంలోనే జగన్ సంక్షేమ క్యాలెండర్ ప్రకటిస్తారు. ఏ నెలలో ఏ పథకాలకు బటన్‌లు నొక్కేదీ ముందుగానే చెప్పేస్తారు. అనుకున్నట్లుగానే అదే నెలలో సంబంధిత పథకాలకు బటన్ నొక్కినా… డబ్బులు మరుసటి, ఆ తర్వాతి నెలల్లో జమవుతున్నాయి. నిధులు లేవా? అంటే అధికారంలో ఉన్న నేతలెవ్వరూ ఒప్పుకోరు. రాష్ట్రం ఆర్థికంగా నిండుకుండలా తొణికిసలాడుతోందని, జీడీపీ వృద్ధిలో బ్రహ్మాండంగా ఉందని గొప్పలు చెబుతారు. ఇటీవలే రెవెన్యూ లోటు గ్రాంటు కింద కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లకుపైగా విడుదల చేసింది. ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ నుంచి అప్పులు తెస్తూనే ఉన్నారు. అయినా సీఎం తన మానస పుత్రికలుగా పేర్కొనే నవరత్న పథకాల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి రావడంలో ఆలస్యమవుతూనే ఉంది.
source : eenadu.net
Discussion about this post