కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. తనకు సన్నిహితుడైన, నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చింది.
ఈ నేపథ్యంలో ఏ 1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ 2గా టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ 3గా ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్, ఇన్‌క్యాప్ సంస్థల మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు (ప్రస్తుతం ద.మ. రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్)తోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసులు నమోదు చేసింది.
ఫైబర్‌నెట్ పేరుతో చంద్రబాబు బృందంప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ తన చార్జ్‌షీట్‌లో సవివరంగా పేర్కొంది. ఎఫ్‌ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబును ఏ 25గా పేర్కొనగా అనంతరం దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా తాజాగా చార్జ్‌షీట్‌లో ఏ1గా చేర్చారు. ఈ వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉంది.
కీలక అధికారుల వాంగ్మూలం..
ఫైబర్‌నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలను సేకరించింది. ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించి నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది.
ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని, ఈ టెండర్ల ప్రక్రియలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారని సెక్షన్ 164 సీఆర్‌పీసీ ప్రకారం న్యాయస్థానంలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
source : sakshi.com
Discussion about this post