ప్రొద్దుటూరు పట్టణంలోని సంజీవనగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి తెదేపాకు చెందిన ఫ్లెక్సీల తొలగింపుపై వైకాపా, తెదేపా నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏ క్షణాన ఏమీ జరుగుతుందోననే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని 8వ వార్డులో శనివారం ఉదయం 7 గంటలకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి ఎన్నికల ప్రచారం జరగనుంది. ఈ నేపథ్యంలో వార్డులో తెదేపా ఫ్లెక్సీలను లేకుండా చేయాలని వైకాపా కార్యకర్తలు భావించారు. ఈ క్రమంలో వార్డు ప్రవేశ మార్గంలో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పుట్టిన రోజుకు సంబంధించిన రెండు ఫ్లెక్సీలు ఉన్నాయి. వీటిని తొలగించి వాటి స్థానంలో ఎమ్మెల్యేకు చెందిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని వైకాపా కార్యకర్తలు ప్రయత్నించారు. దీనిని గమనించిన తెదేపా కార్యకర్తలు అక్కడికి చేరుకుని అడ్డుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ యుగంధర్, పట్టణ ఒక్కటో ఠాణా ఎస్.ఐ.మంజునాథ్ ఘటనాస్థలానికి చేరుకుని సర్ది చెప్పి పంపించారు. అనంతరం పురపాలక సంఘం సహాయ నగర ప్రణాళికాధికారి (ఏసీపీ) మునిరత్నం తన సిబ్బందితో తొలగించిన తెదేపాకు చెందిన ఫ్లెక్సీలను పట్టణంలోని 5వ వార్డు సచివాలయానికి చేర్చారు. తెదేపా ఫ్లెక్సీలను తొలగించిన స్థానంలో వైకాపాకు చెందిన వాటిని ఏర్పాటు చేసే ఆస్కారం ఉందని, వాటిని అడ్డుకోవాలని, శనివారం ఉదయం ఎమ్మెల్యే ప్రచారానికి వచ్చే వరకు బందోబస్తు ఉండాలని సిబ్బందికి సీఐ సూచించారు.
source : eenadu.net
Discussion about this post