రానున్న ఎన్నికల్లో జనంతో మాత్రమే జగన్ పొత్తు ఉంటుందని, వైఎస్సార్‌సీపీకి సంక్షేమ పథకాలు పొందిన ప్రజలే స్టార్ క్యాంపయినర్లని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 1, 3 వార్డుల్లో చెలిమి పెద్దన్న, శంకర తేజ, యుగంధర్‌ల ఆధ్వర్యంలో స్థానిక శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 300 చేనేత కుటుంబాల వారు ఎమ్మెల్యే కేతిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన కప్పల ఆదినారాయణ, బ్యాళ్ల హరీష్, పురుషోత్తం, సుబ్రహ్మణ్యం, బాబా ఫకృద్దీన్, దాసరిలోకేష్, పల్లా గంగాధర్, పొరాళ్ల నాగరాజు, వెంకటనారాయణ, అన్నం ఆదినారాయణ, సాకే భాస్కర్, భీమన పల్లి నాగరాజు తదితరులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలన్నీ కలిపి పొత్తులతో వచ్చినా…కుట్రలతో వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేతకు చేయూత లేక నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. అప్పుల బాధతో నేతన్నలు ఆత్మహత్యలకు తెగిస్తే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు కార్మికుల కుటుంబాలను కనీసం పరామర్శించలేదన్నారు. అందువల్లే ఆనాడు తాము చేనేత కార్మికుల కోసం ధర్మవరంలో జోలెపట్టి యాచించి రూ.25 లక్షల సాయాన్ని బాధిత కుటుంబాలకు అందించామన్నారు. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున 52 మందికి ఆర్థిక సాయం అందించామన్నారు. అలాగే ముడిపట్టు రాయితీని ఏడాదికి ఒకేసారి ఇచ్చే విధంగా ‘ వైఎస్సార్ నేతన్న నేస్తం’ ద్వారా ఏటా రూ.24 వేలు అందిస్తున్నామన్నారు. నవరత్నాల పథకాలతో ధర్మవరం నియోజకవర్గంలో 90 శాతం మంది నిరుపేదలకు రూ.3,200 కోట్లు నిధులు జమ చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. రూ.5 వేల కోట్లతో తాము ఆర్‌ఓబీ, రిజర్వాయర్లు, రోడ్లు, ఆస్పత్రులు, ‘నాడు–నేడు’తో పాఠశాలలను అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ నాయకులు కోర్టులకెళ్లి అడ్డుపడుతున్నారన్నారు. అభివృద్ధి నిరోధకులకు ఽరానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.
source : sakshi.com
Discussion about this post