తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో రోజురోజుకూ నైరాశ్యం పెరిగిపోతోంది. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై అందరిలోనూ సందేహం వ్యక్తమవుతోంది. పొత్తులపైనా నిర్దిష్ట నిర్ణయం జరగక దిగువ స్థాయి కేడర్ సతమతమవుతోంది. టికెట్‌పై స్పష్టత కొరవడడంతో సీనియర్లలోనూ నిరాసక్తత పెరిగిపోతోంది. అసలు ఎన్నికలు సమీపిస్తున్నా అభ్యర్థులెవరన్నది తేలకపోవడంతో ఎక్కడా ఆ హడావుడి మాత్రం కనిపించడం లేదు.
ఓ వైపు అధికార పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంటే తమ పార్టీ అధినేత మీనమేషాలు లెక్కించడం కార్యకర్తలను గందరగోళంలో పడేస్తోంది. మరోవైపు ప్రతి చోటా పొత్తు ధర్మం పేరుతో మిత్రపక్షమైన జనసేన అభ్యర్థుల హడావుడి వారిని తీవ్రంగా కలచివేస్తోంది. ఇప్పటికే జనంలోకి వైఎస్సార్‌సీపీ దూసుకుపోతూ… ప్రజల్లో విశ్వాసం కూడగడుతుంటే తాము మాత్రం ఏం చేశామో…
భవిష్యత్తులో ఏం చేస్తామో… చెప్పుకోలేక… డీలాపడిపోతోంది. దీనికి తోడు అప్పుడప్పుడు పెదబాబు… ఇటీవల చినబాబు చేసిన పర్యటనలకు ఖర్చులు పెట్టలేక టికెట్లు ఆశిస్తున్న నాయకులు చేతులెత్తేస్తున్నారు. తీరా ఏర్పాటుచేసిన సభల్లో వారి ప్రసంగాలు ఆకట్టుకోలేకపోవడం… సభలు వెలవెలబోవడంతో ఎక్కువమంది పార్టీ వీడే యోచనలో ఉన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం టీడీపీలో అభ్యర్థిత్వాల వ్యవహారం రోజుకోమలుపు తిరుగుతోంది. ఈ స్థానంలో తమ పార్టీ పోటీచేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఇప్పటివరకూ తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్న ఆ పార్టీ నేత బత్తుల బలరామకృష్ణకు తాజాగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి రూపంలో షాక్ తగిలేలా ఉంది. ఆయనకు కాకుండా జనసేనకు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు సుమారు 300 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లడంతో పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
శ్రీసత్యసాయి జిల్లాలో ఏ నియోజకవర్గం పరిశీలించినా.. వేరు కుంపట్లు కనిపిస్తున్నాయి. దీనిపై విసిగెత్తిపోతున్న కేడర్ టీడీపీకి టాటా చెబుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో టీడీపీ ఖాళీ అయ్యింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆ జిల్లాలో జరిపిన పర్యటనల్లో పార్టీ నాయకుల మధ్య గొడవలు వెలుగు చూడటం గమనార్హం.
పెనుకొండలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ బి.కె.పార్థసారథి కంటే సవితమ్మ ఎక్కువ హడావుడి చేశారు. మడకశిరలో దళితులను వెనక్కి నెట్టి.. గుండుమల తిప్పేస్వామి అన్నీ తానై వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది. రాప్తాడులో పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత హడావుడి చూసి శ్రీరామ్ ధర్మవరం వైపు ఎందుకొస్తున్నారంటూ చాలా మంది టీడీపీ వీడుతున్నారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఒక వర్గం ఏకంగా ఎన్నికల ప్రచారమే చేస్తోంది.
source : sakshi.com
Discussion about this post