ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మార్చి 16న ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో పోటీ చేసే అభ్యర్థులు ఇష్టారీతిన నగదు ఖర్చు పెట్టడానికి వీలు లేకుండా పోయింది. సభలు, ర్యాలీలు, భోజనాలు, వాహనాల ఏర్పాటు తదితర ఎన్నో ఖర్చులకు సంబంధించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని పక్కాగా అమలు చేసేందుకు అధికారులు, తనిఖీ బృందాలు ఆయా నియోజక వర్గాల్లో పని చేస్తున్నాయి. నామినేషన్ వేసే సమయంలో పార్టీల అభ్యర్థులు మారితే అప్పటి వరకూ చేసిన ఖర్చును పార్టీ ఖాతాలోకి లెక్కిస్తారు.
నామినేషన్ నుంచి లెక్క..
● అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసినప్పటి నుంచి ఖర్చు లెక్కిస్తారు. అభ్యర్థి ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తెరిచి లావాదేవీలు నిర్వహించాలి. అభ్యర్థి ఖర్చులను ఎన్నికల పరిశీలకులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు.
● 1952 సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి వ్యయం రూ.లక్ష ఉండేది. 1962లో రూ.3లక్షలు, 1975లో రూ.5లక్షలకు చేరింది. 1984లో రూ.10 లక్షలకు, 2014లో రూ.28లక్షలు, ప్రస్తుత ఎన్నికల్లో రూ.40 లక్షలకు చేరింది. ఇక పార్లమెంట్ అభ్యర్థి రూ.95 లక్షలు ఖర్చు చేయవచ్చు.
● ఓటర్లను ప్రలోభ పెట్టడంలో భాగంగా అభ్యర్థులు ఎలాంటి ఖర్చు చేయరాదు. తనిఖీల్లో పట్టుబడిన నగదు, గిఫ్ట్ సామిగ్రి అభ్యర్థిదని తేలితే వారి ఖాతాల్లోకి వ్యయాన్ని చేరుస్తారు. పార్టీల జెండాలు, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, వాహనాల బాడుగ, సభా వేదికలు, మైకులు, పత్రిలకు యాడ్‌లు, సోషియా మీడియా ప్రకటనలు సైతం అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగానే లెక్కిస్తారు. ప్రతి రూపాయికీ లెక్క చూపాల్సిందే.
source : sakshi.com
Discussion about this post