దళితులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా అవమానాలు సహజమే అంటూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిరలో గురువారం నియోజకవర్గ వైకాపా పరిశీలకుడి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనిపై ఎమ్మెల్యేకు సరైన సమాచారం ఇవ్వలేదు. తనకు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ నియోజకవర్గ పరిశీలకుడు పి.అశోక్‌కుమార్‌కు తిప్పేస్వామి శుక్రవారం లేఖ రాశారు. ‘‘నేను విజయవాడలో ఉన్నానని తెలిసి కొన్ని గంటల ముందు సమావేశం విషయం తెలియజేశారు. ఇదంతా నేను మీటింగ్‌కు రాకూడదనే ఉద్దేశంతోనే జరిగిన తంతుగా భావిస్తున్నా. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నేను లేకుండా సమావేశం జరపడం ఎంతవరకు సమంజసం. దళిత వర్గానికి ఏం సందేశం పంపించాలని అనుకున్నారో తెలియజేయాలి. ఇది దళితులను అవమానించడం కాదా? ఎన్నికల సమయంలో ఇది పార్టీకి నష్టం కలిగించదా? మీటింగ్‌లో మీ పక్కన ఉన్న అసమ్మతి నాయకులు నన్ను తిడుతూ ఉంటే మీరు వారించకపోగా నవ్వుతూ కూర్చున్నారు. ఇది దేనికి సంకేతం. దళితులైన మేము ఎంత పెద్దపదవిలో ఉన్నా అవమానాలు భరించడం సహజమే అని ఊరికే ఉన్నాను. ఈ మీటింగ్‌కు 90 శాతం వైకాపా ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు హాజరుకాలేదని మీకు తెలుసా? దళితుడినైన నన్ను అవమానించినా ఫర్వాలేదు. ముఖ్యమంత్రి జగన్‌ను తిరిగి గెలిపించడానికి సహకరించమని కోరుతున్నా’’ అంటూ తిప్పేస్వామి తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
source : eenadu.net
Discussion about this post