సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచే సమర శంఖం పూరించనున్నారు. మార్చి 30 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్ణయించారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకనుగుణంగానే పర్యటన షెడ్యూల్ రూపొందించాలని నేతలకు పవన్ సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మూడు విడతలుగా పవన్ ప్రచారం ఉండనుంది. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించనున్నారు.
పిఠాపురం వెళ్లిన తొలిరోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని పవన్ దర్శనం చేసుకోనున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని పవన్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి భాగస్వాములైన తెదేపా, భాజపా నేతలతో భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారని.. పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనల్లో పవన్ పాల్గొంటారు. ఉగాది వేడుకలను సైతం పవన్ పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు.
source : eenadu.net
Discussion about this post