భవిష్యత్తులో ప్రజల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా
వివిధ పథకాల రూపంలో రూ. 4.23 లక్షల కోట్లు అందించాం
అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్
తెదేపా సభ్యుల వాకౌట్
పరిపాలన వికేంద్రీకరణకు రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని, కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు చేరువైందని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలను భావితరాలు శాశ్వతంగా అనుభవించేవరకూ అభివృద్ధి వేగాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకు భవిష్యత్తులోనూ ప్రజల సహకారం, గట్టి మద్దతు కొనసాగుతాయని ఆశాభావంతో ఉన్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ‘2019 జూన్ నుంచి వివిధ పథకాల రూపంలో రూ.4.23 లక్షల కోట్ల మేరకు అందించాం’ అని వివరించారు.
సేవల కోసం 2.6 లక్షల మంది వాలంటీర్లు
‘ప్రభుత్వ సేవలను లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరవేసేందుకు 2.6 లక్షల మంది వాలంటీర్లను నియమించాం. 1.35 లక్షల మంది ఉద్యోగులను గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించాం. భూముల రీసర్వే కింద రెండుదశల్లో 4వేల గ్రామాల్లో 42.6 లక్షల ఎకరాలను రీసర్వే పూర్తిచేశాం. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. వెలిగొండ ప్రాజెక్టులో రెండోటన్నెల్‌ను త్వరలో ప్రజలకు అంకితం చేస్తాం. అవుకు రెండో టన్నెల్ పూర్తికావడంతో ఎస్‌ఆర్‌బీసీ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులకు పెంచాం. మూడో టన్నెల్ పనులు జరుగుతున్నాయి’ అని తెలిపారు.
విద్యారంగంలో రూ.73,417 కోట్ల ఖర్చు
‘విద్యపై పెట్టుబడి ఎప్పుడూ అధిక రాబడిని ఇస్తుందని నమ్మిన ప్రభుత్వం, ఈ రంగంలో ప్రవేశపెట్టిన వినూత్న పథకాల కోసం ఇప్పటివరకు రూ.73,417 కోట్లు ఖర్చుచేసింది. విద్యాసంస్థల్లో నాడు-నేడు కింద రూ.7,163 కోట్లు ఖర్చుచేశాం. బైజూస్ కంటెంట్‌తో 8వ తరగతి విద్యార్థులకు 9.52 లక్షల ట్యాబ్‌లు పంపిణీ చేశాం. రాష్ట్రంలో 4,635 కి.మీ. మేర 1,877 రోడ్లలో గుంతలు లేకుండా చేయనున్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక సంస్థ ఆదాయం, ఆక్యుపెన్సీ పెరిగాయి’ అని వివరించారు.
ఉచిత విద్యుత్ సరఫరాకు ఫీడర్ల ఏర్పాటు
‘19.41 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట 9 గంటల ఉచితవిద్యుత్ సరఫరా కోసం ఫీడర్లు ఏర్పాటుచేశాం. విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇప్పటివరకు రూ.48,175 కోట్ల సబ్సిడీని అందించాం. ఈ ప్రభుత్వ చొరవతో 311 భారీ, మెగా పరిశ్రమలు రాగా, 1.30 లక్షల మందికి ఉపాధి లభించింది. గతేడాది విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడి సదస్సులో రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించిన వారితో 386 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాం’ అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
తెదేపా సభ్యుల వాకౌట్
గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలు చెబుతున్నారంటూ.. దీనికి నిరసనగా తెదేపా సభ్యులు మధ్యలో వాకౌట్ చేసి వెళ్లిపోయారు. అంతకుముందు.. నినాదాలు చేస్తూ బైబై జగన్ అనే ప్లకార్డులు ప్రదర్శించారు. అందుకు ప్రతిగా వైకాపా సభ్యులు జై జగన్ అంటూ అరిచారు.
source : eenadu.net
Discussion about this post