‘గత ఎన్నికల్లో వైకాపాను అధికారంలోకి తీసుకురావడానికి 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. వైకాపాను నా భుజాల మీద వేసుకొని, అండగా నిలబడ్డా. అధికారంలోకి తెచ్చా. ఆ కృతజ్ఞత నేడు కొంతైనా లేదు. నాపై, నా వ్యక్తిగత జీవితంపై దాడులు చేస్తున్నారు. అయినా నేను భయపడను. వైఎస్‌ఆర్ పాలనకు, జగన్ పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉంది’ అంటూ సీఎం జగన్‌పై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. తిరుపతి, అనంతపురంలలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఒక్క సీటు లేని భాజపా రాజ్యమేలుతోంది. వైకాపా, తెదేపా, జనసేనలు రాష్ట్ర ప్రజలందరినీ భాజపాకు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని అడ్డుకోవడం కోసమే కాంగ్రెస్‌లో చేరా. 2014 ఎన్నికలప్పుడు వెంకన్న సాక్షిగా మోదీ మాట ఇచ్చి తప్పారు’ అని విమర్శించారు.
‘పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే.. దానికి నిధులివ్వని మోదీని చంద్రబాబు, జగన్ ప్రశ్నించడం లేదు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేవి. రాష్ట్రంలో 19 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి, మోసం చేశారు. యువత పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీ యువత లేని రాష్ట్రంగా మారిపోతుంది. కాంగ్రెస్ గెలిస్తేనే విభజన హామీల అమలు సాధ్యం. సీపీఎస్ రద్దును మ్యానిఫెస్టోలో పెడతాం’ అని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మాజీ మంత్రులు చింతా మోహన్, జేడీ శీలం, పళ్లంరాజు, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post