రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు ప్రజల నుంచి నిరసన ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమె కనగానపల్లి మండలం మద్దెలచెరువు, వేపకుంట, కొండపల్లి గ్రామాల్లో పర్యటించారు. మద్దెలచెరువులో గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ జెండాలు ఊపుతూ ‘గో బ్యాక్’ అంటూ నిరసన తెలిపారు. టీడీపీ హయాంలో మా గ్రామానికి మీరు చేసిందేమీ లేదని, ఇక్కడ మీ మద్దతదారులు ఎవ్వరూ లేరంటూ నినాదాలు చేశారు. దీంతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సద్దుమణిగించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రత్యక్షంగా ఎదుర్కొనే సత్తా లేక మాజీ మంత్రి పరిటాల సునీత చీప్ ట్రిక్స్ చేస్తున్నారు. కనీసం వెంట తిరిగే వారు కూడా జీర్ణించుకోలేని స్థితిలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకే టీడీపీ కండువాలు వేసి కొత్తగా చేరినట్లు ప్రచారం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయింది. అయితే కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల వేదికగా.. సొంత పార్టీ కార్యకర్తలకే కండువా వేసి కొత్తగా పార్టీలో చేరారని చెబుతున్నారు. వాస్తవాలు తెలుసుకున్న ‘తమ్ముళ్లు’ పరిటాల సునీత గిమ్మిక్కులపై మండి పడుతున్నారు. ఆదివారం రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం మద్దెలచెరువు, వేపకుంట గ్రామాల్లో పరిటాల సునీత ప్రచారం చేశారు. కాగా వేపకుంటలో పది కుటుంబాలు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. కానీ అందులో ఉన్న వారందరూ టీడీపీ కార్యకర్తలే.
source : sakshi.com
Discussion about this post