జనసేన, తెదేపా ఉమ్మడిగా పోటీచేసే అభ్యర్థుల జాబితా మరో పది రోజుల్లోగా విడుదలయ్యే అవకాశం ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. సుజాతనగర్ దరి ఒక ప్రయివేటు కల్యాణ మండపంలో విశాఖ గ్రామీణ జిల్లా జనసేన అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు అధ్యక్షతన గురువారం పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాగబాబు సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. జనసేన కార్యకర్తలు, వీర మహిళలకు దిశా నిర్దేశం చేయడానికే సమావేశం నిర్వహించామన్నారు. పెందుర్తి నియోజకవర్గంలోని సమస్యలపై అధ్యయనం చేసి ఎలాంటి న్యాయం చేయాలన్న విషయంపై చర్చించామన్నారు. జనసేన ఎన్ని శాసనసభ, పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంపై కూటమి పెద్దలు నిర్ణయిస్తారన్నారు. జనసేన, తెదేపా కూటమిలో భాజపా కూడా చేరుతుందన్న నమ్మకం వచ్చిందన్నారు. అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారా..? అని విలేకరులు ప్రశ్నించగా కూటమి నిర్ణయించినట్టే నడుచుకుంటామన్నారు. చింతకాయల విజయ్‌ను కలవడంపై మాట్లాడుతూ అది సాధారణ కలయికేనన్నారు. ఈసారి వైకాపా ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు సుందరాపు సతీశ్, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post