అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేదు. పల్లె, పట్నం అన్న భేదం చూపదు. ఆపదలో ఉన్నామని కాల్ వచ్చిందంటే చాలు కుయ్ కుయ్ మంటూ ముంగిటకే వచ్చేస్తుంది. బాధితులకు కొండంత ధైర్యం ఇచ్చేస్తుంది. దివంగత నేత వైఎస్సార్ హయాంలో పురుడు పోసుకున్న 108 పథకం ఆపన్నులకు అందిస్తున్న భరోసా అంతా ఇంతా కాదు. ఏపీలో అమలవుతున్న ఈ వ్యవస్థ దేశంలో మిగతా రాష్ట్రాలకూ ఆదర్శంగా మారింది. గడిచిన నాలుగేళ్లలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 108 అంబులెన్సుల ద్వారా 3.73 లక్షల మందికి పైగా సేవలు పొందారంటే ప్రజలకు ఎంతలా ఈ వ్యవస్థ సాంత్వన చేకూర్చిందో అర్థం చేసుకోవచ్చు.
టీడీపీ హయాంలో అధ్వానం..
ఎంతో గొప్ప ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. డీజిల్‌కూ డబ్బుల్లేవంటూ మొండిచేయి చూపారు. మరమ్మతులకు నిధులు మంజూరు చేయక అటకెక్కించేందుకు యత్నించారు. 108 అంబులెన్సులను ఎక్కువగా పేదలే ఉపయోగించుకుంటారనే కనీస ఆలోచన కూడా చేయకుండా పూర్తిగా కనుమరుగు చేసేలా వ్యవహరించారు.
పునరుజ్జీవం పోసిన సీఎం జగన్
అవసాన దశకు చేరిన 108 వ్యవస్థపై సీఎం జగన్ వచ్చీ రాగానే ప్రత్యేక దృష్టి సారించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే నాటికి మండలానికి ఒక అంబులెన్సు కూడా అందుబాటులో లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 63 మండలాలు ఉండగా 32 వాహనాలు మాత్రమే ఉండేవి. అవికూడా 5 లక్షల కిలోమీటర్ల పైగా తిరిగి అవసాన దశకు చేరాయి. అలాంటిది మండలానికి రెండు కొత్త అంబులెన్సులతో పాటు అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులను సీఎం జగన్ కేటాయించారు. ఒక నియోనేటల్ (చిన్నారుల కోసం) అంబులెన్సు ఏర్పాటు చేశారు. తగినంత మంది సిబ్బందిని నియమించారు.
లక్షల మందికి సేవలు
జిల్లా వ్యాప్తంగా నేడు 108 వ్యవస్థ పరుగులు పెడుతోంది. గతంలో సంవత్సరమంతా కలిపినా 45 వేల మందికి కూడా సేవలు అందేవి కావు. నేడు ఏడాదిలోనే సేవలు పొందుతున్న వారి సంఖ్య 1.10 లక్షలకు పైగానే చేరుకుంది. నాలుగేళ్లలో 82 వేల మందికి పైగా గర్భిణులు సేవలు పొందారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఫోన్ చేసిన 25 నిమిషాల్లో, పట్టణాల్లో అయితే 15–20 నిమిషాల్లో ఘటనా స్థలికి అంబులెన్సులు చేరుకుంటున్నాయి.
source : sakshi.com
Discussion about this post