నార్పల మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మేజర్ పంచాయతీలోని కూతలేరు వంతెన వద్ద ఎమ్మెల్యే పద్మావతి శనివారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం శిలాఫలకం ఏర్పాటు చేస్తుండగా సొంత పార్టీకి చెందిన సత్యనారాయణరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. అందులో తమ నాయకుడి వర్గీయుల పేర్లు లేవని వారు వాదనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు సాంబశివారెడ్డి సూచనతో శింగనమల నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా వీరాంజనేయులును నియమించడాన్ని నార్పల సత్యనారాయణరెడ్డి బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన వర్గీయులు సైతం సాంబశివారెడ్డి నిర్ణయాలను ఏమాత్రం అంగీకరించడం లేదు. శిలాఫలకంలో సత్యనారాయణరెడ్డి వర్గీయులైన ఉపసర్పంచి శ్రీరాములు, మార్కెట్‌యార్డ్ డైరెక్టర్ అమీర్ పేర్లను ఉద్దేశపూర్వకంగానే తీసివేశారని అనుచరులు అధికారులతో వాదనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. శనివారం ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.
source : eenadu.net
Discussion about this post