సీటు ఎలా ఇస్తాం.. రూ.50 కోట్లు చూపించాలని చెప్పాను కదా… అదేంటి సార్.. పార్టీ కష్టకాలంలో ఉంటే.. మా ఆస్తులన్నీ అమ్మి క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చాం కదా.. ఈ సమయంలో ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి. ఇదిగో రూ.20 కోట్లు మాత్రమే ఉన్నాయి. మీరు కొంచెం సహకరిస్తే.. ఏయ్.. మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్.. ఓటుకు నోటు ఎలాగో.. సీటుకు కోట్లు అలాగే.. ఇది ఫిక్స్. అసలే పొత్తు లెక్కలతో ప్రతి సీటుకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. మీలాంటి వాళ్లకు సీటివ్వలేను. తమాషాలు చేయకుండా.. పార్టీకి పనిచేయండి.. ఇవీ.. సీనియర్ నేతలు, పార్టీని భుజస్కంధాలపై మోసిన నాయకులతో చంద్రబాబు నిస్సిగ్గు వ్యాఖ్యలు.
నోట్ల కట్టలు చూపించినవారికే టికెట్ కన్ఫార్మ్ చేసిన చంద్రబాబు వైఖరిపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పార్టీని నమ్ముకుంటూ పనిచేస్తుంటే నోట్ల కట్టలకు సీట్లు అమ్ముకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోకపార్టీ జనసేన లో నూ ఇదే వైఖరి కనిపిస్తోంది. పదేళ్లు కష్టపడిన వారిని పక్కన పెట్టేసి.. కొత్తగా కండువా కప్పుకున్న వారికి టికెట్ కట్టబెట్టిన పవన్ వ్యవహారంపైనా క్యాడర్‌లో వ్యతిరేకత మొదలైంది. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే సుకొని కండువాపై కండువా వేసుకుంటూ ప్రచారం చేయడం తమ వల్ల కాదంటూ టీడీపీ, జనసేన నాయకులు కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఉమ్మడి విశాఖలో ప్రతి నియోజకవర్గంలోనూ ఈ అసమ్మతి కుంపటి రోజురోజుకూ రాజుకుంటోంది. ప్రతి నియోజకవర్గంలోనూ క్యాడర్ మొత్తం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తీరును తూర్పారపడుతున్నారు.
source : sakshi.com
Discussion about this post