ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైకాపా మరింతగా బరితెగిస్తోంది. ప్రభుత్వ పథకాల పంపిణీకి వాలంటీర్ల సేవలు వినియోగించుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాలకు వక్రభాష్యం చెబుతూ.. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందే కుట్రను కొనసాగిస్తోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయించవద్దని ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలిస్తే.. దానికి తెదేపానే కారణమంటూ వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఆదివారం కూడా దుష్ప్రచారం చేసింది. తెదేపా వల్ల పింఛన్ల పంపిణీ ఆగిపోయిందంటూ ప్రచారం చేయాల్సిందిగా ‘యూనిటీ ఆఫ్ వాలంటీర్స్’ వంటి వాట్సప్ గ్రూపులను ఏర్పాటుచేసి వాలంటీర్లను ప్రేరేపిస్తోంది. ‘వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా తెదేపా వారు ఆపేశారు. వాలంటీర్లను తీసేస్తారు. ఇక ఎవరికీ పింఛను ఇవ్వరనీ వార్డుల్లో అందరికీ చెప్పాలి’ అంటూ ఆ గ్రూప్‌లో సందేశాలు వెళ్లాయి. మండలస్థాయి అధికారుల (ఎంఎల్‌ఓ) ద్వారా వాలంటీర్లకు ఆ సందేశాలు వెళుతున్నట్లు సమాచారం. వాలంటీర్లలో అత్యధికులు వైకాపా కార్యకర్తలే కావడం, ఈ ఎన్నికల్లో వారు ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వంటి సంఘటనల నేపథ్యంలో ఎన్నికల సంఘం వారిని సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. కానీ దీన్ని తెదేపాకు అంటగట్టి, పింఛనుదారుల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెంచేందుకు వైకాపా కుట్ర పన్నింది. దీన్ని కూడా వాలంటీర్ల ద్వారానే అమలుచేస్తోంది.
పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి పత్రికలో కట్టుకథలు అల్లుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 28న సాక్షిలో ‘ఏప్రిల్ 3 నుంచి పింఛన్ల పంపిణీ’ అని ప్రచురించింది నిజం కాదా అని నిలదీశారు. అప్పటికి ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ‘‘అసలు ప్రభుత్వ ఖజానాలో నిధులెందుకు ఉంచలేదు? వాటిని అస్మదీయ కంపెనీలకు బిల్లుల చెల్లింపు కోసం ఖర్చుచేసింది నిజం కాదా’’ అని మాల్యాద్రి ప్రశ్నించారు.
source : eenadu.net
Discussion about this post