‘తెదేపా, భాజపాతో కలిసి వస్తున్నందున ఏ శక్తీ మనల్ని ఆపలేదు. అప్పుల్లో కూరుకుపోయి, అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన రాష్ట్రాన్ని కాపాడటానికి మూడు పార్టీల పొత్తు ద్వారా కృషి చేస్తున్నా. దీనికోసం ఎంతో నలిగిపోయా. జాతీయ నాయకులతో చీవాట్లు తిన్నా. రెండు చేతులెత్తి దండం పెట్టి మా రాష్ట్రం కోసమని ప్రాధేయపడ్డా’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. తెదేపా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసంలో ఆ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రెండు పార్టీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో వైకాపా నాయకులు అంతర్గత విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తారని, ఆ పన్నాగాల్ని తిప్పికొట్టాలని కోరారు. తర్వాత భాజపా క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ పాక సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అంజిబాబును వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జనసేన ముఖ్య నేతలతో సమావేశమై ప్రసంగించారు.
అప్పులు తెచ్చి బటన్లు నొక్కుతున్నావ్
‘జగన్ నువ్వు అప్పులు తెచ్చి బటన్లు నొక్కుతూ నేను మగాణ్ని అంటున్నావ్. అభివృద్ధి చేసి మగాణ్ని అనిపించుకో. అప్పుడు నీకు సలాం చేస్తాం. తెదేపా- జనసేన ప్రభుత్వం వస్తే పథకాలతో పాటు అభివృద్ధి చేస్తాం. జగన్ నువ్వు సిద్ధం అంటే మేం యుద్ధం అంటాం’ అని అన్నారు. కానీ జగన్ యుద్ధం చేసేంత గొప్పవాడా కాదా అన్నది మనం నిర్ణయించుకోవాలని జనసేన నాయకులతో వ్యాఖ్యానించారు.
కులాలను వాడుకొని ఎదుగుతున్నారు
‘మనం కులాలను కలుపుకొనిపోతుంటే.. జగన్ వ్యక్తిగత లబ్ధి కోసం వాటిని విచ్ఛిన్నం చేస్తున్నారు. బీసీలకు సీట్లిస్తున్నామని చెబుతూనే వారిని ఉత్సవ విగ్రహాలను చేసి నిర్ణయాధికారం లేకుండా కూర్చోబెట్టారు. సంఖ్యాబలం ఉన్న కులాల్లో సఖ్యత లేదు.. అది సాధిస్తేనే ఆ కులాలు జగన్ దగ్గర దేహి అనే స్థితి నుంచి బయటపడతాయి. జగన్ లాంటి నాయకులు కులాలను వాడుకుని ఎదుగుతున్నారు. ఆ పరిస్థితి మారాలి.. మారుస్తాం. నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు. అందరి కోసం పెట్టాను. జగన్.. నువ్వు నన్ను వైజాగ్‌లో ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఆపితే నెట్టుకుంటూ ముందుకొస్తా. నేను ఎప్పుడు జనసేన ప్రయోజనాలు ఆలోచించలేదు. రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచించా. డబ్బులతో ఓట్లు కొనలేని రాజకీయాలు రావాలి’ అని పవన్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు.. వీళ్లంతా సమస్త మానవాళికి చెందినవారు. అలాంటి మహానుభావులను మనం కులాల పేరుతో దూరం చేసుకున్నాం. జగన్.. శెట్టిబలిజలు- కాపులు, కాపులు- క్షత్రియులు ఇలా కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజంలో సుస్థిరత లేకుండా చేస్తున్నారు. జగన్ ఈ రోజు ఉంటారు.. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు గుర్తు కూడా ఉండరు. ఎన్నికల వస్తున్నాయని నేను ఇలా మాట్లాడటం లేదు. సమాజ సుస్థిరత నా ధ్యేయం’ అని చెప్పారు.
మా అన్నయ్యతో విభేదించి వచ్చా
‘భీమవరం వైకాపా ఎమ్మెల్యేకు, నాకు వ్యక్తిగత శత్రుత్వం లేదు. తులసి అనే వ్యక్తి వచ్చి ఎమ్మెల్యే నా వియ్యంకుడు.. ఆయన్ను ఏమీ అనొద్దన్నారు. మరి మా అన్నయ్య కాంగ్రెస్‌లో ఉంటే ఆయనతో విభేదించి పార్టీ పెట్టా. బంధుత్వం వేరు.. రాజకీయం వేరు’ అని పవన్ స్పష్టం చేశారు.
source : eenadu.net
Discussion about this post