రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పెద్దమనిషి ఉమ్మడి అనంతపురం జిల్లా వైకాపా బాధ్యతలు చూస్తున్నారు. ఇటీవల అనంత నగరానికి వచ్చినప్పుడు రాప్తాడు, తాడిపత్రి ప్రజాప్రతినిధులతో పాటు ఉరవకొండ మాజీ ప్రజాప్రతినిధిని పిలిపించుకున్నారు. వారితో రహస్యంగా సమావేశమై కుట్రకు సంబంధించిన ప్రణాళికను వివరించినట్లు తెలుస్తోంది. మూడు నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో ఒకరిద్దరు తెదేపా నాయకుల్ని తమ వైపునకు తిప్పుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కనీసం 50 ఓట్లు ప్రభావితం చేసే నాయకులను డబ్బుతో కొనుగోలు చేయాలనేది ఆదేశాల సారాంశం. వారంతా తెదేపాలోనే ఉంటూ అక్కడి సమాచారం తమకు చేరవేసేలా చూడాలన్నారు. నియోజకవర్గంలో కనీసం వంద గ్రామాల్లో వందమంది తెదేపా నాయకుల్ని తమవైపు తిప్పుకోవడం ద్వారా ఒక్కో స్థానంలో 5 వేల ఓట్లు రాబట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే జాబితాను సిద్ధం చేసి సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
వలసలు పెరుగుతుండటంతో..
వైకాపా ఐదేళ్ల పాలనపై ప్రజలతో పాటు సొంత పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈక్రమంలోనే గ్రామాల్లోని వైకాపా నాయకులు తెదేపా వైపు చూస్తున్నారు.రాప్తాడు, ఉరవకొండ, ధర్మవరం నియోజకవర్గాల్లో వలసలు పెరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో వైకాపా ఇన్‌ఛార్జులు తలలు పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో వలసలు నివారించేందుకు తెదేపాలోని కొందరు నాయకులపై డబ్బు వల విసురుతున్నారు. ఒప్పుకోని వారిని ఇబ్బందులకు గురిచేసి అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.
ఉరవకొండ నియోజకవర్గం వైకాపాలో మాజీ ప్రజాప్రతినిధి, ఆయన కుమారుడిపై సొంత పార్టీ నాయకుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. చాలా గ్రామాల్లో అసంతృప్త నాయకులు తెదేపాలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు యువ నాయకుడు కొన్ని గ్రామాల్లో తెదేపా నాయకులను ప్రలోభాలకు గురిచేసి తనవైపు తిప్పుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు వైకాపాలోని అసంతృప్త నాయకుల్ని బుజ్జగించేందుకు కొంతమందిని పురమాయించారు. వారంతా గ్రామాల్లో పర్యటిస్తూ తెదేపాలో చేరవద్దంటూ అసంతృప్త నాయకుల్ని బుజ్జగిస్తున్నారు. నియోజకవర్గంలో 200 మంది యువతను వైకాపాకు వినూత్న ప్రచారం చేసేందుకు నియమించినట్లు సమాచారం. టిఫిన్ సెంటర్లు, టీషాపులు, మద్యం దుకాణాల వద్ద జనాలతో మాటలు కలిపి వైకాపాకు అనుకూలంగా సంభాషణలు జరిపేలా ప్రణాళికలు తయారు చేశారు.
source : eenadu.net
Discussion about this post