వైకాపా పాలనలో అయిదేళ్ల నరకం నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో, బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘ఎన్నికలకు సమయం 54 రోజులే.. నేను, పవన్‌కల్యాణ్ మా బాధ్యతగా పోరాడతాం. రాష్ట్ర భవిష్యత్తు ను ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాతో కలిసి నడవాలి’ అని విజ్ఞప్తి చేశారు. 2019-24 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేశ్‌కుమార్ రాసిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ సభకు విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ఆర్‌వీ రామారావు అధ్యక్షత వహించగా.. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘ప్రభుత్వాన్ని, సమాజాన్ని దగ్గరి నుంచి గమనించిన జర్నలిస్టు ధర్మాగ్రహం ఇది. 5కోట్ల మంది మనసుల్లో ఏముందో ఈ పుస్తకంలో చెప్పారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా సురేశ్‌కుమార్ దీన్ని రచించారు. ఈ పుస్తకం ఒక ఆయుధం. అయిదేళ్ల నరకాన్ని రాబోయే 54 రోజులూ చర్చించాలి. ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తేవాలి. చొక్కా చేతులు మడతపెట్టే సమయం వచ్చిందని సీఎం జగన్ ఒక సభలో చెప్పారట.. మీరు, మీ వైకాపా కార్యకర్తలు చొక్కా చేతులు మడిస్తే.. తెదేపా కార్యకర్తలు, జనసైనికులు, ప్రజలూ కలిసి కుర్చీలు మడతపెట్టి మీకు కుర్చీ లేకుండా చేస్తారు. ఎన్నికలంటే ద్వంద్వయుద్ధం కాదు. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. మంచికీ హద్దులు ఉంటాయి’ అని హెచ్చరించారు.
నాలుగో రాజధాని అంటున్నారు.. సిగ్గూ, ఎగ్గూ ఉందా?
అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించాలని కోరతామంటున్న ఈ ప్రభుత్వానికి సిగ్గూ, ఎగ్గూ ఉందా? అని చంద్రబాబు మండిపడ్డారు. ‘అయిదేళ్లుగా మూడు రాజధానులని చెప్పి అమరావతి అభివృద్ధిని వదిలేశారు. రూ.2 లక్షల కోట్ల ఆదాయాన్నిచ్చే రాజధానిని విధ్వంసం చేశారు. ఇప్పుడు మళ్లీ మేమే వస్తాం, నాలుగో రాజధాని కోసం పోరాడతామంటే.. ఎంత నీచం? ఈ అరాచకానికి ఏ పేరు పెట్టాలి? ఇదే సైకో విధానం’ అని దుయ్యబట్టారు. అమరావతి మహిళా రైతులకు ‘విధ్వంసం’ పుస్తకాన్ని అంకింతమిచ్చిన సురేశ్‌కుమార్‌ను చంద్రబాబు అభినందించారు. ఇలాంటి దుర్మార్గుడి పాలన వస్తుందంటే.. అప్పట్లో రాజధానికి 35వేల ఎకరాలను 29వేల మంది రైతులు ఇచ్చేవారు కాదని చెప్పారు. అమరావతి మహిళలు అనుభవించిన బాధ, వేధింపులు శత్రువుకు కూడా రాకూడదన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అంటున్నారంటే ఆయన మానసిక పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ప్రజలకు సమస్య వస్తే ప్రభుత్వానికి, సీఎంకు చెబుతారు. ప్రభుత్వమే సమస్య అయితే ఎవరి దగ్గరకు పోవాలి? ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యంతోనే ఈ పరిస్థితి వచ్చింది’ అని చంద్రబాబు విమర్శించారు.
source : eenadu.net
Discussion about this post