ప్రభుత్వ భూములను టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమించుకుని దర్జాగా రియల్ వెంచర్లు వేసి ప్లాట్లను అమ్ముకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగా పలమనేరు నియోజకవర్గంలోని పలువురు జర్నలిస్టులు ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారించిన అధికారులు దాదాపు 40మందిని అర్హులుగా ఎంపిక చేశారు. వారికి పలమనేరు లేదా గంగవరం రెవెన్యూలో రెండెకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలని పలమనేరు ఆర్డీఓ మనోజ్‌రెడ్డి రెండు మండలాల రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఇందులో భాగంగా వారు గంగవరంలో రెండు చోట్ల ప్రభుత్వ భూములను గుర్తించారు. వాటిని పరిశీలించేందుకు ఆర్డీఓ మనోజ్‌రెడ్డి వెళ్లారు. గంగవరం రెవెన్యూ సర్వే నంబర్ 775లో 3.60 ఎకరాలు ప్రభుత్వ గయాళు పోరంబోకుగా ఉంది. అయితే అక్కడున్న భూమిలో 1.35 సెంట్లు ఆక్రమణలకు గురైనట్టు తేలింది. పక్కనే ఉన్న 740/1, 2లకు చెందిన ఎన్.మధుబాబు అనే వ్యక్తి నుంచి 1.60 సెంట్లు, మరో డీకేటీ రైతు నుంచి ఐదెకరాలను చిత్తూరుకు చెందిన కఠారి మోహన్ అనే వ్యక్తి గత టీడీపీ హయాంలో వెంచర్ వేసి ప్లాట్లుగా విక్రయించినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన ఆర్డీఓ అప్పటికప్పుడే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని వెంచర్ ప్రహరీగోడలను కూల్చేయాలని ఆదేశించారు. వెంటనే ప్రభుత్వ భూమి అని బోర్డులను ఏర్పాటు చేయించారు.
గత టీడీపీ పాలనలో పలమనేరు, గంగవరం సమీపంలోని, ప్రస్తుతం ప్రభుత్వ గయాళుగా ఉన్న భూమికి పక్కనే ఉన్న పట్టాభూమిని కొన్న రియల్ట ర్లు అదే నంబరుపై రిజిస్ట్రేషన్లు చేసి ప్లాట్లను అమ్మినట్టు తెలుస్తోంది. పట్టణ సమీపంలోని గంటావూరు ఫ్లైఓవర్ వద్ద ఆక్రమణకు గురైన ఈ స్థలం విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. కేవలం 1.60 ఎకరాల సెటిల్‌మెంట్ భూమిని కొని, దానికి ఆనుకుని ఉన్న డీకేటీ, ప్రభుత్వ భూములను కబ్జా చేసి వీటిని ఇళ్ల స్థలాలుగా విక్రయించడంలో గతంలో రెవెన్యూ అధికారులది ప్రధాన పాత్ర. పట్టా భూమి విస్తీర్ణం కంటే ఎక్కువ భూమిని ఎలా రిజిస్ట్రార్ చేశారో అప్పటి పలమనేరు సబ్ రిజిస్ట్రార్‌కే చెల్లింది. ఇక్కడ జరిగిన భూ కబ్జాపై సమగ్రమైన విచారణ చేసి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ మనోజ్‌రెడ్డి తెలిపారు.
source : sakshi.com
Discussion about this post