వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓటమి ఖాయమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు సీట్లు అమ్ముకుని డబ్బులు పోగేసుకుంటున్నాయని మండిపడ్డారు. టీడీపీ ప్రజలకు చేసిన మంచి ఏదీ లేకపోయినా ఇతరులపై బురదజల్లుతోందని ధ్వజమెత్తారు. గురువారం అనంతపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన 24 అసెంబ్లీ సీట్లలో కూడా పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరన్నారు. మొదటి నుంచి పవన్‌ను గమనిస్తే ప్యాకేజీ పడితే ఒకలా, ప్యాకేజీ పడకపోతే మరోలా మాట్లాడుతుంటారని ఆరోపించారు. మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై సమాధానం చెప్పని ప్యాకేజీ స్టార్ నాలుగో పెళ్లాం అంటూ మాట్లాడటం చూస్తే అతడేమైనా ‘గే’ నా అనే అనుమానం కలుగుతోందన్నారు. సీఎం జగన్ పాలనలో మంచి జరిగితేనే ఓటు వేయాలని అడిగే దమ్ము తమకుందన్నారు. అదే చంద్రబాబు పాలనలో మేలు జరిగి ఉంటే ఓటు వేయండనే దమ్ము మీకుందా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఏ సంక్షేమ పథకాలు అమలు చేశారో చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 175కి 175 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. రాప్తాడులో పరిటాల కుటుంబం తనను ఓడించలేదన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఈ నెల 4న రాప్తాడులో బహిరంగ సభ నిర్వహిస్తున్నాయని.. తనపై ఆ రెండు పార్టీలు చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాకే రాప్తాడులో అడుగుపెట్టాలన్నారు. తాను రూ.500 కోట్లు సంపాదించానంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పినట్లు రూ.2 వేల కోట్లు కానీ, ఎల్లో మీడియా చెప్పినట్లు రూ.500 కోట్లు కానీ తాను సంపాదించినట్లు నిరూపిస్తే ఆస్తులను వారికే రాసిస్తానన్నారు.
source : sakshi.com
Discussion about this post