జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ తగిలింది. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన కీలక నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల వేళ ఉమామహేశ్వరనాయుడు టీడీపీని వీడటం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గడిచిన ఇరవై ఏళ్లుగా ఆయన టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు.
ఉమామహేశ్వర నాయుడు 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లోనూ ఆయన తిరిగి టీడీపీ నుంచే పోటీ చేయాలని భావించారు. నియోజకవర్గంలో పార్టీకి కష్టపడి పనిచేశారు. అయితే.. బాగా డబ్బున్న ఎస్‌ఆర్‌సీ నిర్మాణసంస్థ అధినేత అమిలినేని సురేంద్రబాబుకు టీడీపీ టికెట్ ఇచ్చారు. నియోజకవర్గంతో ఏ మాత్రమూ పరిచయం లేని ఆయనకు టికెట్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. ఇక్కడ ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గాలు కీలకమైనవి. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలసి పనిచేస్తామని ప్రకటించినప్పటికీ.. వారిని కాదని అమిలినేనికి ఇచ్చారు. దీంతో ఉమా, ఉన్నం వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా టీడీపీకి దూరంగా ఉన్న ఉమామహేశ్వరనాయుడు శనివారం ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమాతో పాటు కళ్యాణదుర్గం మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ దొడగట్ట నారాయణ, మాజీ ఎంపీపీ, ప్రస్తుత టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జ్ కొల్లప్ప, కళ్యాణదుర్గం క్లస్టర్ ఇన్‌చార్జ్ తలారి సత్యప్ప, కంబదూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పోలార్పు ఆనంద్ చౌదరి, కళ్యాణదుర్గం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిక్కి గోవిందరా జులు, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, శెట్టూరు మండల ప్రధాన కార్యదర్శి ఆదిశేషు, కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామ ఎంపీటీసీ ఓబయ్య, మాజీ మండల కన్వీనర్ రంగనాఽథ్ శెట్టి, తోపూరి మంజునాథ్ చౌదరి, తిమ్మసముద్రం వెంకటేశులుకు కూడా సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.
అనంతపురం జిల్లా టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ దశలో పార్టీని వీడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో టీడీపీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. అనంతపురం అర్బన్ నేత ప్రభాకర్ చౌదరి, గుంత కల్లు నేత జితేందర్‌గౌడ్ కూడా రేపోమాపో తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. కళ్యాణదుర్గంలో ఉన్నం వర్గం పార్టీకి దూరంగా ఉంటోంది. మొన్న చంద్రబాబు పర్యటనలో కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా పాల్గొనలేదు. కీలక నేతలు దూరమవుతుండటంతో టీడీపీ కేడర్‌లోనూ గందరగోళం నెలకొంది. నామినేషన్లలోపు మరెన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన ఆ పార్టీలో కలుగుతోంది.
source : sakshi.com
Discussion about this post