మండుటెండనూ లెక్క చేయకుండా కి.మీ. కొద్దీ రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం.. నిప్పులు చిమ్ముతున్న సూరీడుతో పోటీపడుతూ చంటిబిడ్డలను చంకనేసుకుని బస్సు వెనుక పరుగులు తీసిన ఆడబిడ్డలు.. రోడ్డుకు ఇరువైపులా గ్రామాల్లో టెంట్‌లు వేసి వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేసి గంటల తరబడి నిరీక్షించిన ప్రజానీకం..! వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో తొలిరోజు కనిపించిన దృశ్యాలు ఇవి.
సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకానికి ఈ దృశ్యాలు ప్రతీకగా నిలిచాయి. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ నుంచి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార భేరిని సీఎం జగన్ బుధవారం మోగించారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరిన సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.
అనంతరం తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల నడుమ బస్సు యాత్రను సీఎం జగన్ ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి వద్దకు బస్సు యాత్ర చేరుకునే సరికి రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున జనం బారులు తీరారు. భారీ క్రేన్‌తో గజమాల వేసి సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు.
source : sakshi.com
Discussion about this post