అసలే తమకు టికెట్లు రాలేదన్న అసంతృప్తిలో ఉన్నారు.. పార్టీ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు.. కొందరు ఎమ్మెల్యేలైతే సీఎం జగన్ పిలిచినా ఆయన్ను కలిసేందుకు రావడం లేదు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన గురువారం సభ ముగిశాక సీఎం అక్కడే ఈ అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడి వారిని ఊరడించే ప్రయత్నం చేసినా.. మంత్రి గుమ్మనూరు జయరాం, కాపు రామచంద్రారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు ఆయనతో మాట్లాడేందుకూ ఇష్టపడలేదు. సరిగ్గా ఎమ్మెల్యేలందరూ ఇంత అసంతృప్తిగా ఉన్న తరుణంలోనే.. రాజ్యసభ ఎన్నికలొచ్చాయి. ఖాళీ అయిన మూడు స్థానాలనూ దక్కించుకోవాలని వైకాపా పెద్దలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ముగ్గురు అభ్యర్థులనూ ప్రకటించేశారు. ఎందుకైనా మంచిదని ఆ ముగ్గురిలో ఇద్దరు బిగ్‌షాట్‌లను ఎంపిక చేశారు. ఇప్పుడా ఇద్దరు అభ్యర్థులు నేరుగా రంగంలోకి దిగారు. అసంతృప్త ఎమ్మెల్యేలను నయానో భయానో లొంగదీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
గురువారం వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభకు వచ్చిన పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలతో ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి నేరుగా, మరో అభ్యర్థి మేడా రఘునాథరెడ్డి తరఫున ఆయన సోదరుడు, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మంతనాలు జరిపారు. ‘రాజ్యసభ ఎన్నికల్లో మీ సహాయ సహకారాలు కావాలి’ అంటూ వారిని కోరారు. అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందిని ఈ ఇద్దరికే కేటాయించారు. దీంతో వారిని సంతృప్తిపరిచేందుకు ఒక ప్రణాళికను వారు సిద్ధం చేశారనే చర్చ జరుగుతోంది. అవసరమైతే విదేశీ పర్యటనకూ తీసుకెళ్లి పోలింగ్ సమయానికి వెనక్కి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ తెదేపా ఈ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దించితే.. సిద్ధం చేసుకున్న ప్రణాళికను వెంటనే అమలు చేసేందుకు వైకాపా పెద్దలు సిద్ధమైనట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సింగపూర్, థాయ్‌లాండ్ లాంటి దేశాలకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లడంపైనా చర్చ జరుగుతోందంటున్నారు.
source : eendu.net
Discussion about this post