ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కరువు పరిస్థితులపై రాజకీయ పార్టీలు తమ విధివిధానాలను ప్రకటించాలి.
ఈ రోజు హిందూపురం పెన్షనర్స్ భవనంలో ప్రపంచ జల దినోత్సవం సభ నిర్వహించడం జరిగింది.
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ సభలో జలసాధన సమితి అధ్యక్షులు ధనాపురం వెంకటరామిరెడ్డి గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సభలో వక్తలు చైతన్య గంగిరెడ్డి, OPDR శ్రీనివాసులు మాట్లాడుతూ తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఉమ్మడి అనంతపురం జిల్లాను రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీవ్రమైన కరువులతో, రైతులు ఆత్మహత్యలతో, వలసలతో అల్లాడిపోతున్న ఈ ప్రాంతానికి హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడమే పరిష్కార మార్గం అని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి ycp ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత రాయలసీమ ప్రాజెక్టు లను నిర్లక్ష్యం చేసారని హంద్రీ నీవా HLC ప్రాజెక్టు 38 పనులను 365 జీవో ద్వారా రద్దు చేసి ఉమ్మడి అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం చేసారని అన్నారు.
గత నాలుగైదు సంవత్సరాలుగా హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు వస్తున్నప్పటికీ కేవలం 150 చెరువులు మాత్రమే నింపారని నిర్దేశించిన విధంగా జిల్లాలో 345000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా తమ విధి విధానాలను ప్రకటిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా కరువు, ప్రాజెక్టు ల పరిస్థితులు పరిష్కారానికి క్రింది చర్యలు చేపట్టాలని జలసాధన సమితి డిమాండ్ చేయడం జరిగింది.
1. హంద్రీనీవా మెయిన్ కాలువ, మడకశిర బ్రాంచ్ కెనాల్ కాలువ వెడల్పు చేసి నిర్దేశించిన విధంగా ఉమ్మడి జిల్లాలోని 345,000 ఎకరాలకు పిల్ల కాలువల ద్వారా ఆయుకట్టుకు నీరు అందించాలి.
2. చిలమత్తూరు, గోరంట్ల మండలాలకు హంద్రీనీవా కాలువ ఏర్పాటు చేయాలి.
3. పెన్నా, జయ మంగలి, చిత్రావతి తదితర నదులకు రెండు కిలోమీటర్లకు ఒక చెక్ డాం నిర్మించి హంద్రీనీవా నీటితో నింపాలి.
4. హంద్రీనీవా ప్రాజెక్టుకు అవసరమైన పదివేల కోట్ల రూపాయలు ప్రత్యేక బడ్జెట్ విడుదల చేసి అధికారంలోకి వచ్చే ప్రభుత్వం రెండు సంవత్సరాల లోపల పూర్తి చేయాలి.
5. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెండింగ్లో ఉన్న భైరవానితిప్ప, పేరూరు, సోమర వాండ్లపల్లి, జిల్లేడు బండ, ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ తదితర ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి.
6. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 1400 చెరువులకు అనుసంధానం చేయాలి.
ఈ కార్యక్రమం లో సడ్లపల్లి చిదంబరెడ్డి, బీఎస్పీ శ్రీరాములు, రైతు సంఘం నాయకులు సిద్ధారెడ్డి, జన విజ్ఞాన వేదిక నాయకులు రామకృష్ణ, జలసాధన సమితి సభ్యులు పరిగి నవీన్, మడకశిర నుండి రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు మరియు చైతన్య సంస్థ నుండి తిప్పేస్వామి, నవీన్ కుమార్ మరియు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Discussion about this post