జగన్ ప్రభుత్వ పరపతి మట్టికొట్టుకుపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన పాలనాతీరుపై గుత్తేదారులకు పూర్తిగా నమ్మకం పోయినట్టుంది. ఏటా వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నామంటూ జగన్ చాటింపు వేసుకోవడమేగానీ.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కనీసం రూ.20 కోట్లు, రూ.30 కోట్ల విలువైన టెండర్లలో పాల్గొనేందుకు కూడా గుత్తేదారులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి దాపురించింది. అధికారులు బతిమలాడుతున్నా జగన్ ప్రభుత్వానికో నమస్కారమంటూ దండం పెట్టేస్తున్నారు. దివ్యాంగులకు రెండో విడతగా 1,750 రెట్రోఫిటెడ్ మోటారు వాహనాలు అందించేందుకు ప్రభుత్వం ఇటీవల పిలిచిన టెండర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ సర్కారు వారి పాట పాడటమే తప్ప.. గుత్తేదారులెవరూ అటువైపుగా చూడటం లేదు. అయిదు నెలలైనా పరిస్థితిలో మార్పురాకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. ఏం చేయాలో చెప్పాలంటూ బంతిని ప్రభుత్వ కోర్టులోకే నెట్టేశారు. తనకు కావాల్సింది కూడా ఇదేనని జగన్ అనుకున్నారేమో తెలియదు గానీ.. ఆ నివేదికను కూడా నెల రోజులుగా మూలన పడేశారు.
ఎన్నికల గిమ్మిక్కులు చేయడంలో జగన్ దిట్ట కదా? అందుకే రెండో విడత కింద మళ్లీ పంపిణీ చేస్తామంటూ ఎన్నికల ముందు హడావుడి మొదలుపెట్టారు. ఆ విషయాన్ని గుత్తేదారులు పసిగట్టినట్లున్నారు. ఆవేశపడి ముందుకెళితే బిల్లులు రావని గుర్తించినట్లున్నారు. అందుకే టెండర్లకు దూరంగా ఉండిపోయారు. 5 నెలల క్రితం వీటి పంపిణీకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండర్లలో పాల్గొనాలంటూ రాష్ట్రంలోని ప్రముఖ తయారీ సంస్థలన్నింటినీ అధికారులు సంప్రదించినా ప్రయోజనం శూన్యం. మొదటిసారి పిలిచినప్పుడు గుత్తేదారులెవరూ రాలేదు. రెండోసారి టెండర్లు పిలిస్తే ఎంపిక చేసిన గుత్తేదారు.. సరఫరా చేయలేనంటూ చేతులేత్తేశారు. మూడోసారి టెండర్లలో బిడ్ వేసింది ఒకే ఒక గుత్తేదారు కావడంతో నిబంధనల ప్రకారం దాన్నీ రద్దు చేశారు.
source : eenadu.net
Discussion about this post