వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే తనకేంటి సంబంధమని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్ ఎన్డీయే అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో రోడ్‌షోలో మాట్లాడారు. నియోజకవర్గ తెదేపా అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. జగన్ అరెస్టుకు తానే కారణమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారని, ఇన్నేళ్లుగా ఆయనేమైనా కోమాలో ఉన్నారా.. ఎన్నికల సమయంలో నిద్ర లేచారా అంటూ ఎద్దేవా చేశారు. బాధితుడు జగన్ సైతం ఈ మాటలు అనలేదని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సత్యసాయిబాబా ట్రస్టు నుంచి బంగారం తరలించానని ఆరోపణలు చేస్తున్న పెద్దిరెడ్డికి మతి భ్రమించిందన్నారు. ఆయన నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం పెద్దిరెడ్డికి ఉందన్నారు.
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటలు ఇక సాగవని నియోజకవర్గ కూటమి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి తన పరిశ్రమల కోసం మామిడి, పాల రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మరో వైపు అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మించి వందల ఎకరాల భూములు స్వాధీనం చేసుకొన్నారని, నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కొనసాగుతోందన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, మంత్రి పెద్దిరెడ్డి దౌర్జన్యాలపై విసుగు చెందిన ఓటర్లు కూటమి అభ్యర్థులను గెలిపించడం ఖాయమన్నారు. రోడ్ షోలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ మణికంఠ పర్యవేక్షించారు. ర్యాలీ, సభ వద్ద ప్రత్యేక నిఘా పోలీసులతో వీడియోలు తీయించారు. పట్టణానికి చెందిన విశ్రాంత డీఎస్పీ సుకుమార్‌బాబును తెదేపాలో చేరారు.
source : eenadu.net
Discussion about this post