జగన్ సీఎం అయ్యాకే పేదల జీవితాల్లో మార్పు వచ్చిందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. బుధవారం 50వ డివిజన్‌లోని 68వ సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాల సమావేశ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, మీ క్షేమం కోరే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని ప్రశ్నించారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని అడిగే దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని చూసి, మరోసారి సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డిని చేసుకుందామని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలో రూ.1045 కోట్ల అభివృద్ధి జరిగిందన్నారు. గతంలో టీటీడీ కల్యాణమండపం నుంచి తిక్క రంగయ్యస్వామి గుడి వరకు రోడ్డు ఎలా ఉండేది.. ఇప్పుడు ఏవిధంగా దాని రూపురేఖలు మార్చామో ఆలోచించాలన్నారు. ప్రస్తుతం శాంతినగర్ సర్కిల్ నుంచి తపోవనం వరకు జరుగుతున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. స్థానికంగా ఉన్న అంధుల ఆశ్రమాన్ని తనిఖీ చేశారు.
source : sakshi.com
Discussion about this post