రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ఎన్నికల సమయంలో జగన్ ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టాక వారి విషయాన్నే మరచిపోయారు. పట్టు రైతులకు పథకాలు ఎత్తేశారు. రాయితీలకు కోత పెట్టేశారు. ‘ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ.7,500 చొప్పున రైతు భరోసా ఇస్తున్నాం కదా.. ఇంకా వాళ్లకు ఇతర పథకాలు అవసరమా? రాయితీలు ఇవ్వాలా?’ అన్నట్లుంది వైకాపా ప్రభుత్వ వైఖరి. తాము అధికారంలోకి వచ్చాక కిలోకు రూ.100కు పైగా ధర పెరిగిందంటూ గొప్పగా చెబుతోంది. కానీ, 33శాతానికి పైగా ఉత్పత్తి వ్యయం పెరిగిందని, తాము రాయితీలూ ఇవ్వడం లేదనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. వెరసి.. 2019 నుంచి పట్టు రైతుల సహనానికి పరీక్ష పెడుతోంది. కేంద్రం నిధులిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విదల్చడం లేదు. ఐదేళ్ల కిందటి వరకు ఉన్నతాధికారులే తరచూ రైతుల దగ్గరకెళ్లి.. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు. ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం పట్టు రైతులే అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి పట్టు రైతులనూ కష్టాలు వెన్నాడుతున్నాయి.
source : eenadu.net
Discussion about this post