ఒకటే ప్రభుత్వం.. ఒకటే శాఖ. కానీ, ఒక్కో జిల్లాలో సబ్ రిజిస్ట్రార్లది ఒక్కో చట్టం. సబ్‌రిజిస్ట్రార్‌ల తీరుతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నిర్వాహకులు దీర్ఘకాలిక (టర్మ్ లోన్), వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారిన నిబంధనల మేరకు జగన్ ప్రభుత్వం మార్గదర్శకాలను ఇవ్వకపోవడంతో పరిశ్రమల నిర్వాహకులపై రిజిస్ట్రేషన్ ఫీజుల భారం భారీగా పడుతోంది. చిన్న పరిశ్రమలను చేయి పట్టుకు నడిపిస్తామని పదేపదే చెప్పే జగన్.. వారు తమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపలేదు. చేయి పట్టుకు నడిపించడం అంటే ఇదే కాబోలు!
రుణం పొందాలంటే.. ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఫీజులు కట్టాల్సిందే
ఆదాయ మార్గాలను వెతికిపట్టడం జగన్ ప్రభుత్వానికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో! గతంలో ఎంత మొత్తాన్ని రుణంగా తీసుకున్నా మార్ట్‌గేజ్ బాండ్ కోసం రూ.10 వేలు చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు దాన్ని 25 రెట్లు పెంచి, చిన్న పరిశ్రమలపై భారం వేసింది. పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 5 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. వీటిలో అత్యధిక పరిశ్రమలు నిర్వహణ మూలధనం కోసం బ్యాంకులపైనే ఆధారపడుతున్నాయి. బ్యాంకుల నుంచి ఎంత మొత్తాన్ని రుణంగా తీసుకున్నా గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మార్ట్‌గేజ్ బాండ్ కోసం రూ.10 వేలు (స్టాంప్ డ్యూటీ రూ.వెయ్యి, ఇతర ఛార్జీలు రూ.9 వేలు) చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు అదే మొత్తాన్ని రుణంగా పొందాలంటే బాండ్ కోసం రూ.2.5 లక్షలు (రుణంగా తీసుకునే రూ.5 కోట్లపై 0.5 శాతం వంతున) రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం తీసుకునే రుణంపై 0.5 శాతం చొప్పున ఫీజు చెల్లిస్తేనే బాండు ఇవ్వాలని ఉందని సబ్‌రిజిస్ట్రార్లు చెబుతున్నారు. అయితే కొన్ని జిల్లాల సబ్‌రిజిస్ట్రార్లు మాత్రం పాత విధానంలోనే రూ.10 వేలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకుని బాండ్లు ఇస్తున్నారు.
కొవిడ్‌తో చితికిపోయిన చిన్న పరిశ్రమలు
గతంలో సొంత నిధులతో పరిశ్రమలను నిర్వహించినవారూ కొవిడ్ తర్వాత తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో బ్యాంకు రుణాలు తీసుకోక తప్పని పరిస్థితి. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో సిబ్బంది జీతాలు, అద్దె, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్ను తదితరాలకు ఖర్చు చేయడంతో సుమారు 30 శాతం వర్కింగ్ క్యాపిటల్ తరిగిపోయింది. ఆ తర్వాత ముడిసరకు ధరలు, రవాణా ఛార్జీలు పెరగడంతో చిన్న పరిశ్రమలు ఆర్థికంగా చితికిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులను బతిమాలుకుని రుణం తెచ్చుకుందామంటే దాన్ని పొందడానికి రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించాల్సిన ఫీజుల కోసం బయట మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితి తలెత్తిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు చిన్నపరిశ్రమలను వేలిపట్టుకుని నడిపించాలని నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. వాటికి రుణాల కోసం రిజిస్ట్రేషన్ల శాఖ ఇచ్చే బాండ్లకు గతంలో మాదిరిగా రూ.10 వేలు మాత్రమే తీసుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలివ్వాలి. లేకుంటే ఇప్పటికే చితికిపోయిన చిన్నపరిశ్రమలు మరింత అప్పుల్లోకి జారిపోతాయి.
source : eenadu.net
Discussion about this post