మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి అండగా మాట్లాడుతున్న సీఎంకు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఆవేదనతో రాస్తున్నది అంటూ తను రాసిన లేఖను గురువారం విడుదల చేశారు. ‘2009లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో.. 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టిన అంశం.. మన కుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం, వారికి నువ్వు రక్షణగా ఉండటం. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్న వ్యక్తిత్వాన్ని ఈ విధంగా నీ పత్రిక (సాక్షి), నీ ఛానల్, సామాజిక మాధ్యమాలు, నీ పార్టీ వర్గాలు తీవ్ర స్థాయిలో హననం చేయడం ఎంత వరకు సబబు’ అని ప్రశ్నించారు.
న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెలు సునీతను హేళన చేస్తూ.. నిందలు మోపుతూ, దాడులకు తెగబడే స్థాయికి కొందరు దిగజారుతుంటే నీకు పట్టడం లేదా అని నిలదీశారు. సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమేంటని ప్రశ్నించారు. కుటుంబసభ్యుడిగా కాకపోయినా ముఖ్యమంత్రిగా అయినా వీటిని నివారించడం నీ కర్తవ్యం కాదా అని అడిగారు. ఇంకా బాధించే అంశం.. హత్యకు కారకులైన ఎంపీ అవినాష్‌రెడ్డికి నువ్వు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించడం. ఇది నీకు సమంజసమా అని నిలదీశారు. ఇలాంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచివి కావు, నీకు తగవని హితవు పలికారు. హత్యకు కారకుడైన వ్యక్తి నామినేషన్ దాఖలు చేసినందున.. చివరి ప్రయత్నంగా, న్యాయం, ధర్మం గురించి ఆలోచనైనా చేయాలని ప్రార్థిస్తున్నానన్నారు. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా నువ్వు.. న్యాయం, ధర్మం, నిజంవైపు నిలవాలని వేడుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్ పులివెందులలోని సీఎస్‌ఐ చర్చి మైదానంలో బహిరంగసభలో మాట్లాడుతుండగానే.. సౌభాగ్యమ్మ ఈ లేఖను విడుదల చేయడం గమనార్హం.
source : eenadu.net
Discussion about this post