‘వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు కాపాడుతున్నారు? అవినాష్ పాత్ర గురించి మరింత సమాచారం బయటకొస్తే కీలకమైన ఇతర వివరాలేవైనా వెలుగు చూస్తాయని జగన్ భయపడుతున్నారా?’ అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రశ్నించారు. ఆయన ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. వివేకాను చంపిన వారెవరో దేవుడికి, కడప ప్రజలకు తెలుసంటూ ఇటీవల వ్యాఖ్యానించిన జగన్‌కు కూడా ఎవరు చంపించారో తెలిసే ఉంటుంది కదా! ఆ విషయం ఆయన ఎందుకు బయటపెట్టట్లేదని నిలదీశారు. షర్మిలను కడప లోక్‌సభ అభ్యర్థిగా నిలబెట్టాలని వివేకా భావించటం వల్లే ఆయన్ను లేకుండా చేశారా? తదితర విషయాలన్నీ బయటకు రావాలని డిమాండు చేశారు. అవినాష్‌ను వెనకేసుకొస్తూ అసెంబ్లీలో మాట్లాడటం మినహా అయిదేళ్లలో ఒక్కసారి కూడా వివేకా హత్య గురించి మాట్లాడని జగన్.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు దాన్ని ప్రస్తావించటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వివేకాను చంపేశాక గత ఎన్నికల్లో దాన్ని రాజకీయాల కోసం వాడుకున్నారని, మళ్లీ ఎన్నికలు వచ్చినందున అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు చోటు ఉండకూడదని అన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వద్ద మంగళవారం సునీత విలేకరులతో మాట్లాడారు.
‘రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగి ఉంది. దాన్నుంచి బయటకు వస్తే తప్ప మనకు పురోగతి లేదు. నేను రాజకీయ నాయకురాలిని కాదు. తప్పు జరిగింది కాబట్టే ఇప్పుడు బయటకొచ్చి వాటి గురించి మాట్లాడుతున్నా. మళ్లీ వైకాపా ప్రభుత్వమే అధికారంలోకి వస్తే వ్యక్తిగతంగా నాకే కాదు.. మన రాష్ట్రానికీ ఏ మాత్రం మంచిది కాదు. ఈ ప్రభుత్వం రాకుండా చేయటమే నా లక్ష్యం. మన రాష్ట్రం బాగుపడాలి. పారిశ్రామికాభివృద్ధి జరగాలి. షర్మిల నా చెల్లెలు. ఈ ప్రభుత్వం గద్దె దిగాలనేదే మా ఇద్దరి లక్ష్యం. దాన్ని సాధించేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తాం. కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న షర్మిలను అభినందిస్తున్నా. గత ఎన్నికల్లో ఆమెను అక్కడినుంచి ఎంపీగా పోటీ చేయించటానికి మా నాన్న శాయశక్తులా ప్రయత్నించారు. ఆ క్రమంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఆమె ముందుకొచ్చి పోటీ చేస్తుండటం భావోద్వేగపరంగా నాకు చాలా ముఖ్యమైనది. సంఘీభావం చెప్పేందుకు ఇడుపులపాయకు వెళ్దామనుకున్నప్పటికీ కోర్టులో కేసు ఉండటం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది.
source : eenadu.net
Discussion about this post