ఎన్నికలు పూర్తయిన తర్వాత చంద్రబాబు ప్రధాన నిందితుడి(ఏ–1)గా సుమారు పది కేసులు నమోదు కాబోతున్నాయని రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం కందుకూరులోని శ్రీవెంగమాంబ ఫంక్షన్ హాల్‌లో కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఏ–1గా ఇప్పటికే మూడు, నాలుగు కేసులు నమోదయ్యాయని, మరో నాలుగైదు కేసులు నమోదు కాబోతున్నాయని చెప్పారు. చంద్రబాబు అవినీతికి పాల్పడిన సొమ్మును విదేశాలకు తరలించి అక్కడ ఆస్తులు కొనుగోలు చేశారన్నారు. అవినీతి సొమ్మును ఏపీలో పెట్టుబడి పెట్టినా కనీసం రాష్ట్రం బాగుపడేదన్నారు.
ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం అని.. ఈ పొత్తుల వల్ల బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు అభద్రతా భావంలోకి వెళ్లారని విజయసాయిరెడ్డి అన్నారు. దీనివల్ల వైఎస్సార్‌సీపీ లాభపడుతుందేగానీ.. నష్టం లేదన్నారు. అదేవిధంగా బీజేపీకి, జనసేనకు కూడా నష్టం లేదన్నారు. కేవలం నష్టపోయేది టీడీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ సీట్ల కేటాయింపులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్పులు చేశారన్నారు.
వైఎస్సార్‌సీపీలో పదవులు అనుభవించిన రఘరామకృష్ణరాజు పార్టీలోనే ఉంటూ.. పార్టీని తిడుతూ రాజకీయం చేశారన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా తిరిగి ఆయనను చట్టసభలకు పంపించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితిని తనకు తానే కొనితెచ్చుకున్నాడని చెప్పారు. ఆయనను బీజేపీ, జనసేన, టీడీపీ సహా ఏ పార్టీ నమ్మడం లేదన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి ఉన్నారు.
source : sakshi.com
Discussion about this post