‘వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తెదేపా- జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు’ అని ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తంచేశారు. ‘తెదేపా – జనసేన కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలని రెండు పార్టీలూ నడుం బిగించాయి. దీన్ని మరింత బలోపేతం చేయడానికి భాజపా ఆశీస్సులూ ఉన్నాయి. మంచి ప్రయత్నానికి ఇది తొలి అడుగు’ అని వివరించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో.. తెదేపా, జనసేన తరఫున శాసనసభకు పోటీ పడే అభ్యర్థుల జాబితాను ఇద్దరు నేతలు ఉమ్మడిగా శనివారం విడుదల చేశారు. నాగపౌర్ణమి శుభ ముహూర్తంలో తొలి జాబితా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, భాజపా కలిసొస్తే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ‘ఐదు కోట్ల ప్రజలకు.. అహంభావి, పెత్తందారీ, ధనబలం కలిగిన పార్టీకి మధ్య జరిగే ఎన్నికలివి. ప్రజలంతా ఆలోచించాలి. తెదేపా- జనసేన అభ్యర్థులకు విజయం చేకూర్చాలి. అందరికీ సీట్లు రాకపోవచ్చు. తెదేపా అభ్యర్థులు పోటీచేసే చోట జనసేన, జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నచోట తెదేపా కార్యకర్తలు సహకరించాలి. ఇరు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అది ఓటుబ్యాంకుగా మారుతుంది’ అని పేర్కొన్నారు.
‘భాజపాతో పొత్తును దృష్టిలో పెట్టుకొని మా సీట్ల సంఖ్యను కుదించుకున్నాం. పరిమిత స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాం. తొలి దఫాలో ఐదుగురు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నామ’ని పవన్‌కల్యాణ్ చెప్పారు. ‘మేం నిర్మాణాత్మకంగా, బాధ్యతగా ఆలోచించాం. ఎక్కువ స్థానాలు తీసుకోవాలని కొందరు చెబుతున్నారు. గత ఎన్నికల్లో పది స్థానాల్లోనైనా గెలిచి ఉంటే ఈసారి ఎక్కువ స్థానాలు తీసుకునే అవకాశం ఉండేది. ఎక్కువ చోట్ల పోటీపడి ప్రయోగం చేయడం కంటే, తక్కువ స్థానాలతో రాష్ట్రానికి ఉపయోగపడాలని నిర్ణయించాం. 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. 3 లోక్‌సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలనూ పరిగణనలోకి తీసుకుంటే.. 40 చోట్ల పోటీ చేస్తున్నట్లు లెక్క’ అని వివరించారు. ‘వ్యక్తి, పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. పార్టీ కోసం కష్టపడ్డవారు, సమర్థులు, అనుభవజ్ఞులకు ప్రభుత్వం ఏర్పడ్డాక పదవుల్లో ప్రాధాన్యమిస్తాం’ అని పవన్ హామీ ఇచ్చారు. జనసేన ఓటు తెదేపాకు బదిలీ అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, ఇది సాఫీగా జరిగేలా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘సిద్ధం అంటూ జగన్ చావగొడుతున్నారు. మేం కూడా యుద్ధానికి సిద్ధమే. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే యుద్ధం’ అని పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post